Actress Anjali: యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్ చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇప్పటికే పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. చివరిగా మే 31న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు అంజలి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే హారర్ కామెడీతో ప్రేక్షకులను పలకరించిన అంజలి.. ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాలగా అందరినీ అలరించడానికి సిద్ధమయ్యింది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ భామ.
బూతులు మాట్లాడాను..
ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ విడుదలయ్యింది. అందులో అంజలి బూతులు మాట్లాడుతూ కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. ఈ విషయంపై తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అంజలి స్పందించింది. ‘‘ముందుగా దర్శకుడు చైతన్య కృష్ణ ఈ సినిమా కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు బూతులు మాట్లాడడం గురించే అడిగాను. సెన్సార్ సమయంలో ఆ డైలాగులను మ్యూట్ చేస్తారు లేదా మారుస్తారు అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే అవే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. రత్నమాల క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అసలు ఈ కథ నాకే ఎందుకు చెప్పాలి అనిపించింది అని డైరెక్టర్‌ను అడిగాను. అందరూ నన్ను పక్కింటమ్మాయి పాత్రల్లోనే చూస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నా పాత్ర కనువిప్పు అన్నారు’’ అని చెప్పుకొచ్చింది అంజలి.
మేకప్ వేసుకోలేదు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాలగా తన పాత్ర గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది అంజలి. ‘‘రత్నమాల మాట్లాడే తీరు, లుక్స్, ప్రవర్తన.. అన్నీ నేను ఇదివరకు చేసిన పాత్రలకంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది నాకు చాలా కష్టమైన రోల్. రత్నమాల ఏ చిన్నదానికి అయినా రియాక్ట్ అయిపోతుంది. కానీ తన మనసు చాలా మంచిది. తనలో ప్రేమ, కేరింగ్ అన్నీ ఉంటాయి. అంతే కాకుండా చాలా గట్టిది కూడా. ఈ పాత్రలో నటించడానికి కష్టం అనిపించినా.. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అంతే కాకుండా ఇందులో నా పాత్ర కోసం నేను అసలు మేకప్ వేసుకోలేదు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో మేము ఇందులో చాలా ప్రయోగాలు చేశాం’’ అని తెలిపింది.
మాస్ వర్షన్..
‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని రత్నమాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని సీతకు మాస్ వర్షన్‌లాంటిది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది అంజలి. తను గోదావరిలో పుట్టిన అమ్మాయే అయినా కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో శ్రీకాకుళం యాసలో మాట్లాడడం కష్టంగా అనిపించిందని చెప్పింది. ‘‘ఇందులో సముద్రాల్లో పనిచేసేవారు మాట్లాడే యాసలో మాట్లాడాలి. వాళ్ల భాష కాస్త వేరేలాగా ఉంటుంది. మనం రోజూ మాట్లాడుకున్నట్టు ఉండదు’’ అని చెప్పుకొచ్చింది అంజలి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.
Also Read: గూగుల్‌ను వదిలి కంటెంట్ క్రియేషన్ వైపు - కేన్స్ వరకు చేరిన నీహారిక - నెల సంపాదన ఎంతంటే?