Devil sequel: ఈరోజుల్లో ఒక సినిమా విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు రాకముందే దానికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు అయితే స్టోరీ రైటింగ్ సమయంలోనే రెండు పార్ట్స్‌గా విడదీసి ముందుగానే సినిమాకు రెండు పార్ట్స్ ఉంటాయని అనౌన్స్ చేస్తున్నారు. మూవీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సీక్వెల్స్ తెరకెక్కించడంపై మేకర్స్ ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఇక తాజాగా విడుదలయిన ‘డెవిల్’ సినిమాకు కూడా సీక్వెల్‌ ఉంటుందా లేదా అనే విషయంపై హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో పాల్గొంటున్న సమయంలో ‘డెవిల్’ సీక్వెల్‌ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 


‘డెవిల్’ సీక్వెల్ అనౌన్స్‌మెంట్..
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ‘డెవిల్’.. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. ఇక ఈ మూవీ మార్నింగ్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సక్సెస్ మీట్‌లో మీడియాతో ముచ్చటించారు. అప్పుడే ‘డెవిల్’ సీక్వెల్ గురించి కళ్యాణ్ రామ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. అయితే దాని గురించి సమాధానం తాను చెప్పను అని, తన టీమ్‌తో చెప్పిస్తానని ఒక వ్యక్తిని పిలిచాడు. తన టీమ్‌లో మరొక వ్యక్తి జపాన్‌కు మంచి హాలిడేకు వెళ్లాడని చెప్తూ నవ్వాడు. తనకు ఎప్పుడూ తోడుగా ఉండే తన టీమ్‌తో ‘డెవిల్’ సీక్వెల్ గురించి అనౌన్స్ చేయించడం బాగుంటుందని కళ్యాణ్ రామ్ అన్నాడు.


డెవిల్ 2 కథ ఇదే..
కళ్యాణ్ రామ్ టీమ్ మెంబర్.. ‘‘2024లో డెవిల్ 2 స్టార్ట్ అవుతుంది’’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ స్వయంగా.. ‘డెవిల్ 2’ గురించి మరికొన్ని విశేషాలు పంచుకున్నాడు. ‘‘చెప్పాలని కాదు కానీ డెవిల్ 2 ఆలోచన మాకు ముందు నుండే ఉంది. మొదటి షెడ్యూల్ 2022 డిసెంబర్ 9న ప్రారంభమయ్యింది. షూటింగ్ మొదలయిన 10 రోజులకే మాకు ఆ ఐడియాను ఇచ్చారు. ఇలా చేస్తే సీక్రెట్ సర్వీసులతో ముందుకు వెళ్లొచ్చు అని అన్నాడు. చాలా బాగుంది కథ. ఆ కథ గురించి చిన్న హింట్ ఇస్తాను. డెవిల్ 2లో 1940ల్లో కనిపిస్తుంది. 21వ శతాబ్దం కూడా కనిపిస్తుంది. అది రెండిటిని కలిపి ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారు’’ అంటూ డెవిల్ 2 గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాడు కళ్యాణ్ రామ్.


ప్రేమకథ అనవసరం..!
‘డెవిల్’ మూవీలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బింబిసార’ వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘డెవిల్’ కూడా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ సినిమాలో కూడా మరోసారి వీరి కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు ప్రశంసించినా.. ఒక స్పై థ్రిల్లర్‌లో అనవసరంగా ప్రేమకథను ఇరికించారు అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది పక్కన పెడితే.. సినిమా అయితే బాగుందని, థ్రిల్లింగ్‌గా ఉందని చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. ముందుగా ఈ చిత్రానికి నవీన్ మేడారం.. దర్శకుడు అని ప్రకటించినా.. ఆ తర్వాత నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు అభిషేక్ నామా.


Also Read: నిద్ర పట్టదు, సందీప్ రూల్స్ బ్రేక్ చేశాడు - ‘యానిమల్’పై టాలీవుడ్ దర్శకుల కామెంట్స్