Jr NTR Latest News | మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' (Devra Movie). సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకం అనిపించేలా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటు అభిమానులపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడంతో పాటు తనపై ప్రేమను కురిపించిన ఫ్యాన్స్ ను ఇలాగే ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
దేవరకు ప్రత్యేకమైన స్థానం
"దేవర పార్ట్-1కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. నా సహనటులైన జాన్వి, సైఫ్ అలీ ఖాన్ సార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతోపాటు ఇతర నటీనటులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మా కథకు జీవం ఇచ్చి, తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇక నా డైరెక్టర్ కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశా నిర్దేశంతోనే ఈ ప్రాజెక్టు ఇంత సక్సెస్ ఫుల్ అయింది. అలాగే అనిరుధ్ అద్భుతమైన సంగీతం, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సర్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు, విఎఫ్ఎక్స్ యుగంధర్ గారు, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఈ సినిమాను అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు' అంటూ తన సినిమాకు పని చేసిన నటీనటులు టెక్నీషియన్లకు ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పారు.
ఇంకా ఆ లెటర్లో 'మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించినందుకు థియేటర్ ప్రదర్శకులకు, పంపిణీ దారులకు ధన్యవాదాలు. నా సినిమా పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు' అంటూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆ తర్వాత నిర్మాతల గురించి మాట్లాడుతూ 'మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కొసరాజుకి ఈ ప్రాజెక్టు విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు' అని రాస్కొచ్చారు.
శిరస్సు వంచి ధన్యవాదాలు
చివరగా అభిమానుల గురించి ప్రస్తావిస్తూ 'ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల నుంచి ఇంతటి ఆదరణ చూపించిన ప్రేక్షకులకు, నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ.. గత నెల రోజుల నుంచి 'దేవర' చిత్రాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అయింది. ఇక ఇప్పటి నుంచి మీరు ఎప్పటికీ గర్వపడే సినిమాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. దేవర పార్ట్ వన్ మూవీని మీ భుజాలపై మోసి ఇంతటి ఘన విజయం అయ్యేందుకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు' అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.