భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా, ఎటువంటి పట్టింపులు ఉండకుండా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా చూడ బుద్ధి వేస్తుంది. అటువంటి సినిమాల్లో 'జోకర్' ఒకటి. జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఐదేళ్ల క్రితం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే విజయం అందుకుంది. దీనికి సీక్వెల్‌ వస్తే బాగుండు అనే మాట ఆ రోజుల్లోనే వినిపిచింది. ఎట్టకేలకు సీక్వెల్ రెడీ చేసింది సినిమా టీమ్.


మ్యూజికల్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌!
జోకర్ సీక్వెల్ టైటిల్ వచ్చేసి ‘జోకర్‌: ఫోలి అ దు’. ఇటీవల ప్రచార చిత్రాలు విడుదల చేశారు. ఇటు టీజర్‌, అటు ట్రైలర్‌ అదిరిపోవడంతో 'మరో అదిరిపోయే సినిమా చూస్తాం' అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కీలక పాయింట్‌ను కూడా టీమ్‌ ప్రచార చిత్రాల ద్వారా చెప్పేసింది. మ్యూజికల్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న రెండో 'జోకర్‌'లో ప్రముఖ హాలీవుడ్‌ కథానాయిక, పాప్‌ సింగర్‌ లేడీ గాగా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను కూడా ప్రచార చిత్రాల్లో చూపించారు. 


‘ఈ ప్రపంచం ఓ వేదిక’ అంటూ రాసి ఉన్న పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖంపై రక్తంతో, ఇద్దరూ కలసి డ్యాన్స్‌ చేస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ బావుంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘సంగీతం వల్ల మాత్రమే జీవితాలు పూర్తవుతాయి. దాని వల్లే మా గాయాలూ మాయమవుతాయి. నేనిప్పుడు ఒంటరి వాణ్ని కాదు’ అంటూ ప్రచార చిత్రాల్లో సినిమా మెయిన్‌ ప్లాట్‌ను చెప్పించారు. ఇక తన స్పెషల్‌ రోల్‌ అథుర్‌ ఫ్లెక్‌ అలియాస్‌ జోకర్‌ పాత్రలో ఫీనిక్స్ నటిస్తుండగా... హార్లే క్విన్‌ పాత్రలో లేడీ గాగా కనిపించనుంది.


Also Readవెండితెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ జీవితం... సినిమాలో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!






అక్టోబర్ 4న 'జోకర్ 2' రిలీజ్!
ఈ సినిమాను అక్టోబరు 4న విడుదల చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. మరి ఈసారి బాక్సాఫీసుపై జోకర్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి. 'జోకర్‌'గా ఫీనిక్స్‌ ఎలా నటిస్తాడో, ఇంకా చెప్పాలంటే ఎంతలా జీవిస్తాడో మనకు తెలిసిందే. దీంతో తనకు అలవాటు ఉన్న పాత్రలో... సీక్వెల్‌లో ఫీనిక్స్‌ నట విశ్వరూపం చూస్తామని అభిమానులు అంచనా వేస్తున్నారు. అలాగే అవార్డులు కూడా ఆయనను వరిస్తాయని అని కూడా అంటున్నారు. 



బాబ్‌ కేన్, బిన్‌ ఫింగర్, జెర్రీ రాబిన్సన్‌ రాసిన 'ది జోకర్‌' అనే కామిక్‌ పుస్తకం ఆధారంగా టాడ్‌ ఫిలిప్స్‌ సినిమా తెరకెక్కించారు. అందులో 'జోకర్‌'గా నటించి అలరించిన ఫినిక్స్‌కు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ పురస్కారం కూడా దక్కింది. దీంతో పాటు బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ (మ్యూజిక్‌) అవార్డును కూడా సినిమా టీమ్‌ దక్కించుకుంది. మొత్తంగా ఆస్కార్‌లో 11 నామినేషన్లు దక్కగా.. పై రెండు పురస్కారాలు దక్కాయి. ఇక ఆ రోజుల్లో 55 మిలియన్ డాలర్లతో రూపొంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ డాలర్లకుపైగా వసూళ్లు దక్కాయి. మన కరెన్సీలో చెప్పాలంటే... రూ. 450 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 9000ల కోట్లకు పైగా వసూలు చేసింది.


Also Readవేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్, సూర్య సినిమాకు పోటీగా