ఈమధ్యకాలంలో సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ సక్సెస్ రేసులో దూసుకుపోతున్నారు. వారి ఇమేజ్‌కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్న సీనియర్ హీరోలను సక్సెస్ వరిస్తోంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశారు. తమిళంలో కనీసం అరడజను సినిమాల అనుభవం కూడా లేని అట్లీకి బాలీవుడ్ బాద్‌షా.. ఒక అవకాశం ఇచ్చి చూశారు. అంతే ఆ అవకాశాన్ని 200 శాతం వినియోగించుకున్నాడు అట్లీ. షారుఖ్‌తో కలిసి సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌లో ఒక యాక్షన్ మూవీ రెడీ చేశారు. అదే ‘జవాన్’. ఇప్పుడు ఆ మూవీ కేవలం బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇదే సమయంలో షారుఖ్ చేసిన ఒక ట్వీట్.. నెటిజన్లను ఆకర్షిస్తోంది. షారుఖ్ చెప్పినదాన్నిబట్టి చూస్తే ‘జవాన్’కు సీక్వెల్ ఉండబోతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.


సౌత్ ఫ్లేవర్ సినిమా..
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’లో షారుఖ్‌తో తలపడే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. కేవలం విజయ్ సేతుపతిని మాత్రమే కాదు.. ఇందులో చాలావరకు కీలక పాత్రలు పోషించిన నటీనటులను సౌత్ నుండి దిగుమతి చేశాడు అట్లీ. ఇప్పటికే సౌత్‌లోని దాదాపు అన్ని భాషల్లో చిత్రాలు చేసి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా ‘జవాన్’తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జవాన్’.. అప్పటికే ప్రీ బుకింగ్ విషయంలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో కూడా మరెన్నో రికార్డులు సృష్టిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో షారుఖ్.. ఎప్పటిలాగానే ట్విటర్ ద్వారా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించే ప్రయత్నం చేశారు.


విజయ్ సార్‌కు నేను కూడా పెద్ద ఫ్యాన్‌నే..
‘జవాన్’లో విజయ్ సేతుపతి.. కాలీ అనే పాత్రను పోషించాడు. ఆ పాత్రను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్.. షారుఖ్‌ను ప్రశించాడు. ‘సార్ మీరు కాలీతో ఎందుకు డీల్ కుదుర్చుకోవడం లేదు? నేను విజయ్ సేతుపతి సార్‌కు పెద్ద ఫ్యాన్’ అని అడిగాడు. దానికి షారుఖ్ ఇచ్చిన సమాధానం అందరినీ అయోమయంలో పడేసింది. ‘నేను కూడా విజయ్ సార్‌కు పెద్ద ఫ్యాన్‌నే. ఇప్పటికే కాలీ బ్లాక్ మనీ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇతరుల స్విస్ బ్యాంక్స్‌లోని మనీని తీసుకుంటాను. అక్కడికి వెళ్లడానికి వీసా కోసమే వెయిట్ చేస్తున్నాను’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు ఎస్‌ఆర్‌కే. ఆయన ఇచ్చిన సమాధానం ఫన్నీగానే ఉన్నా.. మధ్యలో స్విస్ బ్యాంక్ గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అంటే ఒకవేళ ‘జవాన్’కు సీక్వెల్ ఉంటుందేమో, దాని కథలో షారుఖ్.. స్విస్ బ్యాంకును టార్గెట్ చేస్తారేమో అంటూ మరికొందరు తమ సొంత కథలను రాసేసుకుంటున్నారు.






సినీ పరిశ్రమలో సీక్వెల్స్ హవా..
ఇప్పటికే సినీ పరిశ్రమలో సీక్వెల్స్ హవా మామూలుగా లేదు. ఒక సినిమా పూర్తవ్వగానే దానికి సీక్వెల్ ఉంటుందేమో అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలవుతున్నాయి. ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ను గమనించిన మేకర్స్ కూడా చాలావరకు తమ సినిమాలకు సీక్వెల్స్‌ను ముందే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘జవాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌ను అట్లీ.. వేరే హీరోతో ప్లాన్ చేసినా బాగానే ఉంటుంది అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌లో డెబ్యూతోనే షారుఖ్ లాంటి సీనియర్ హీరోతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు కాబట్టి.. అట్లీ అడిగితే ఇంకా ఏ సీనియర్ హీరో అయినా కచ్చితంగా తన సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.


Also Read: బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యానే - ఎవరిని కలిసినా అదే ప్రశ్న అంటూ...


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial