'ఘోస్ట్' సినిమా ప్లాప్ అయిన తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna )... ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అదే రోజున Nag99 టైటిల్ టీజర్ విడుదల చేయడంతో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 


నాగార్జున తదుపరి చిత్రానికి 'గలాటా', 'భలే రంగడు' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా 'నా సామి రంగా' అనే మరో టైటిల్ తెర మీదకు వచ్చింది. ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. దివంగత అక్కినేని నాగేశ్వర రావు నటించిన 'సిపాయి చిన్నోడు' సినిమాలో 'నా జన్మభూమి ఎంత అందమైన దేశము.. నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము.. నా సామి రంగా' అనే పాట ఉంది. ఆ సాంగ్ లోని లిరిక్స్ తీసుకొని టైటిల్ పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే... గలాటా లేదా నా సామి రంగా - ఈ రెండు టైటిల్స్ లో నాగార్జున దేనికి ఓటు వేస్తారో చూడాలి. 


మలయాళంలో హిట్టైన 'పొరింజు మరియం జోస్‌' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి నాగార్జున ఆసక్తి కనబరస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు రైటర్లతో స్క్రిప్ట్ వర్క్ చేయించారట. వారిలో బెజవాడ ప్రసన్న కుమార్ పేరు బాగా వినిపించింది. అయితే చివరకు విజయ్ బిన్ని ట్రీట్ మెంట్ బాగా నచ్చడంతో అతనికే ఛాన్స్ ఇవ్వాలని కింగ్ నిర్ణయించుకున్నారట. 


ఏదైతేనేం ఇప్పటి వరకూ ఎందరో కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున.. ఈసారి తన 99 సినిమాతో విజయ్ బిన్నీని డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ప్రారభించకముందే టీజర్ షూట్ చేసి, నాగ్ బర్త్ డేకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి, 2023 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. 


నాగ్ గతంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' 'బంగార్రాజు' సినిమాలతో పొంగల్ బరిలో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ గా పెట్టుకొని 'బంగార్రాజు' చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు Nagarjuna99 సినిమాని కూడా చిత్రీకరించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకొని, పగడ్బందీగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. మరో వారంలో ఈ ప్రాజెక్ట్స కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.



2024 సంక్రాంతి కోసం టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పండక్కే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. రవితేజ 'ఈగల్', తేజ సజ్జా 'హనుమాన్' కూడా పక్కా వస్తామని అంటున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు పొంగల్ ని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇప్పుడు కింగ్ నాగ్ సైతం బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. మరి ఫైనల్ రేసులో ఏయే సినిమాలు ఉంటాయి.. ఎవరెవరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందనేది వేచి చూడాలి.



Also Read: MEGA156 - మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 'మెగా రాకింగ్' ఎంటర్టైనర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial