Sarathkumar As Nathanadhudu First Look from Kannappa: టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ఈ మూవీ షూటింగ్ 90 శాతానికి పైగా న్యూజిలాండ్ లోనే కంప్లీట్ చేశారు. మిగతా భాగం భారత్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
‘కన్నప్ప’ చిత్రంలో శరత్ కుమార్ లుక్ రివీల్
‘కన్నప్ప’ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ నటుడిని పాత్రను రివీల్ చేసింది కన్నప్ప టీం.
సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ (జూలై 14) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రబృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో ఆయన లుక్ ను రివీల్ చేస్తూ పాత్రను పరిచయం చేశారు. నాథనాధుడిగా ఆయన కనిపించబోతున్నట్లు వెల్లడించింది. చేతులలో ఖఢ్గాలు పట్టుకుని పోరాట యోధుడిగా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శరత్ కుమార్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా మారుతాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
రూ. 100 కోట్ల బడ్జెట్, 5 భాషల్లో విడుదల
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా.. మహాశివుడి భక్తుడైన కన్నప్ప పాత్ర ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు. ‘మహాభారతం’ టీవీ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ సినిమా రంగాలకు చెందిన టాప్ హీరోలు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. ‘కన్నప్ప‘ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అంబానీ పెళ్లిలో ఆసక్తికర సంఘటన - అమితాబ్ కాళ్లకు నమస్కరించిన రజనీకాంత్, వీడియో వైరల్