Indra Movie Writer Chinni Krishna Sorry to Chiranjeevi: ప్రముఖ సినీ రచయిత, 'ఇంద్ర' మూవీ రైటర్ చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. కేంద్రం చిరుకు 'పద్మవిభూషణ్' ప్రకటించిన నేపథ్యంలో నేడు ఆయనను కలిసిన చిన్నికృష్ణ.. అనంతరం ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరును క్షమాపణలు కోరుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కాగా గతంలో ఆయన చిరుపై విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఇంద్ర’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తనను చిరంజీవి ఏనాడు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదంటూ దుర్బాషలాడారు. గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఆయన క్షమాపణలు కోరడం గమనార్హం.
"అన్నయ్య చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించా. ఈ సందర్భంగా నేడు స్వయంగా ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఈ భూమ్మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నేను కూడా తప్పు చేశాను. నాపై నమ్మకంతో నన్ను పిలిచి 'ఇంద్ర' సినిమా అవకాశం ఇచ్చారు. మూవీ రిలీజైన తర్వాత భారతదేశం గర్వించదగ్గ రచయిత చిన్నికృష్ణ అని ఆయన అన్న రోజే నా జన్మ ధన్యమైంది. కానీ, కొంతమంది ప్రోద్భలంతో నా జీవితంలోనే అత్యంత దారుణమైన బ్యాడ్‌టైమ్‌లో అన్నయ్యను నా నోటితో అనరాని మాటలు అన్నాను.
ఇప్పుడు పేర్లు చెప్పను కొందరి ప్రభావం, ఒత్తిడి వల్ల ఆ రోజు ఆయనపై పలు వ్యాఖ్యలు చేశాను. నోటికొచ్చినట్టు మాట్లాడాను. దాని వల్ల నా భార్య, బిడ్డలు, చెల్లి, బావ, సమాజం, నా మిత్రులు నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా భగవంతుడి ముందు, స్నేహితుల ముందు క్షమాపణ కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో అంతర్మధనం చెందాను. ఆ సంఘటన తర్వాత ఇప్పటి వరకు చిరంజీవిగారికి ఎదురుపడలేదున. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని విష్ చేయడానికి ఇంటికివెళ్తే.. ఎంతో అప్యాయంగా పలకరించారు.
మనసులో ఏం పెట్టుకోకుండా ఆయన నన్ను ఆహ్వానించిన తీరు, నా భార్యబిడ్డల గురించి వారి బాగోగుల గురించి అడిగిన తీరు చూసి నాలో నేనే ఎంతో బాధపడ్డా. 'ఇలాంటి వ్యక్తినా నా నోటితో తప్పుగా మాట్లాడాను’ అని ప్రశ్చాత్తాపడి అన్నయ్యను క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో క్షమించిన ఆయన దగ్గరకు తీసుకుని కథలు ఏమన్నా రాస్తున్నావా చిన్ని? అని అడిగారు. మనసారా మాట్లాడటమే కాదు 'కలిసి పని చేద్దాం.. మంచి కథ చూడు’ అని అన్నారు. ఈసారి ఆయనతో పని చేసే సినిమా దేశం గర్వించేలా ఉండాలని కోరుకుంటున్నా. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అన్నయ్య అని ప్రాధేయపడ్డాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నారు’’ అని వీడియోలో చెప్పుకొచ్చారు.