'కల్కి 2898 AD' మే 9న విడుదలకు సిద్ధమైంది. ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో ప్రభాస్ తో పాటు, విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే సమయానికి విడుదల కానున్న 'ఇండియన్ 2' సినిమా రెండు వారాలు ఆలస్యంగా విడుదల కానుంది.


1996 మే 9న విడుదలైన భారతీయుడు చిత్రం ఓ సంచలనం. అదే తేదీన 'ఇండియన్ 2' విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ‘కల్కి 2898 AD’ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, కల్కి సినిమా రిలీజ్ డేట్ ఇది వరకే ఖరారు అయి ఉండటంతో, రెండు చిత్రాల మధ్య క్లాష్ రాకూడదని, రెండు వారాల గ్యాప్ లో 'ఇండియన్ 2' విడుదల చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నట్టు సమాచారం. 


కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కొంతకాలం కిందటే 'ఇండియన్ 2' షూటింగ్ పూర్తి చేసుకోగా, చిత్రాన్ని సమ్మర్ కానుకగా మేలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. కాగా, ఈ రెండు మెగా చిత్రాల్లోనూ, స్టార్ హీరో కమల్ హాసన్ నటించడం వల్ల రెండు ప్రాజెక్టుల మధ్య క్లాష్ రాకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.


డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో 'గేమ్ చేంజర్ ' చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పనుల్లో పడి, ఇది వరకు ' ఇండియన్ 2' సినిమాను డైరెక్టర్ శంకర్ కొద్దిరోజులు పక్కకు పెట్టారు. 'విక్రం'తో కమల్ హిట్టు కొట్టటంతో, 'ఇండియన్ 2' షూటింగ్ ఊపందుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తవగా, ఎట్టి పరిస్థితుల్లో ఈ మేలోనే చిత్రం విడుదల చేయాలని చిత్ర యూనిట్ బలంగా నిర్ణయించుకుంది. 'కల్కి’తో క్లాష్ రాకుండా కనీసం రెండు వారాలు వెయిట్ చేయాలనుకుంటోంది ఈ టీం. తొందర్లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. 


‘ఇండియన్ 2’ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించింది. ఇది ఇండియన్ (1996)కి సీక్వెల్, ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. వృద్ధ స్వతంత్ర సమరయోధుడిగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పౌరుడిగా కమల్ హాసన్ తన విలక్షనమైన నటనతో భారతీయ సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు.


రకరకాల కారణాల వల్ల ఇండియన్ 2 షూటింగ్ సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా 2018లోనే ప్రకటించారు. ఆమె ఈ చిత్రం కోసం కలారీ వంటి విద్యలు కూడా నేర్చుకున్నారు. కాగా, ఈ చిత్రంలో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సిద్ధార్థ్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. మొత్తానికి భారీ తారాగణంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఎండాకాలం సెలవుల్లో సందడి తేబోతోంది. కమల్ హాసన్ అభిమానులకు ఈ చిత్రంతో పాటూ, ‘కల్కి’తోనూ ధమాకా ఇవ్వబోతున్నారు. అటు డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో రాబోతోనున్నారు. అంటే ఈ సమ్మర్ హాలిడే సినీ ప్రియులకు పండగే! 


Also Read : డార్లింగ్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతున్న హను రాఘవపూడి