Prabhas - Hanu Raghavapudi Movie : టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. ఇక పాన్ ఇండియా హీరోలైతే ఒక సినిమాకి రెండు నుంచి మూడేళ్లు తీసుకుంటున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓవైపు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.


గత ఏడాది 'ఆదిపురుష్', 'సలార్' లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక 'సలార్'తో మంచి కమ్ బ్యాక్ అందుకున్న డార్లింగ్ ప్రస్తుతం 'కల్కి2898AD', 'రాజా సాబ్', 'స్పిరిట్' వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితోపాటు 'సలార్ పార్ట్-2', హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే హనురాఘవపూడితో ప్రభాస్ చేయబోతున్న సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.


ప్రభాస్ సరసన హాలీవుడ్ హీరోయిన్


'సీతారామం' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హనురాఘవపూడి తన తదుపరిచిత్రాన్ని ప్రభాస్ తో చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించారట మూవీ టీమ్. ఇందులో భాగంగానే రీసెంట్ గా ప్రభాస్ కి జోడిగా శ్రీలీల నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ కావడంతో దర్శకుడు హను ఓ హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ప్రభాస్ బర్త్ డే రోజున అధికారిక ప్రకటన


హను రాఘవపూడి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాని డార్లింగ్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న అధికారికంగా ప్రకటించనున్నారట. అంతేకాకుండా నవంబర్లో ఈ ప్రాజెక్టుని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇక డిసెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా


హను రాఘవపూడి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ', 'పడి పడి లేచే మనసు' లాంటి సినిమాలకి ఇతనే మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఆ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇవే కాకుండా 'సీతారామం' సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించాడు విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాకి కూడా అతనే సంగీతం అందిస్తున్నారట.


Also Read : తాప్సీ పన్ను పెళ్లంట - ఎప్పుడు, ఎక్కడో తెలుసా?