2024 Tollywood & Kollywood : ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నార్త్ అమెరికా నుంచి నైజాం వరకూ.. అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 425 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మరోసారి తెలుగు సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'తెలుగు సినిమా' ఆధిపత్యం కొనసాగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 


నిజానికి ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ పేరు చెప్పుకునేవారు. ఎంత మంచి చిత్రాలు తెరకెక్కించినా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో అంతా మారిపోయింది. ఎస్.ఎస్ రాజమౌళి 'బాహుబలి' చిత్రాలతో దేశ విదేశాల్లో సంచలనం సృష్టించగా.. మిగతా దర్శకులంతా ఆయన బాటలోనే నడుస్తూ, టాలీవుడ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. హిందీ చిత్రాలు మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోడానికే నానా తంటాలు పడుతుంటే, మన సినిమాలు మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నాయి. 


ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కూడా పుంజుకున్నాయి. తెలుగు సినిమాల మాదిరిగానే భారీ విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా మాలీవుడ్ చిత్ర పరిశ్రమ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తోనే సంచలనాలు సృష్టిస్తున్నారు. పరిమిత బడ్జెట్ లో హై క్వాలిటీ సినిమాలు తెరకెక్కిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ విషయంలో కోలీవుడ్ కాస్త వెనుకబడి పోయిందనే అనుకోవాలి. దక్షిణాదిలో అత్యధిక సినిమాలు రూపొందించే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి, ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుకునే సినిమాలు పెద్దగా రావడం లేదు. గత ఆరు నెలల్లో ఒక్కటంటే ఒక్క బిగ్గెస్ట్ హిట్ లేదు. కానీ 2024 ద్వితీయార్థంలో పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 


ఇండియన్ 2:


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబోలో రాబోతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇండియన్ 2'. ఇది 1996లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్. తెలుగులో 'భారతీయుడు 2' పేరుతో విడుదల కాబోతోంది. ఇందులో బొమ్మరిల్లు సిద్దార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్.జె. సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జెయింట్ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


రాయన్:


కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'రాయన్'. దీంట్లో సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఇది ధనుష్ కెరీర్ లో మైలురాయి గోల్డెన్ జూబ్లీ మూవీ కావడంతో, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్లు, పాటలు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 26న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


తంగలాన్:


వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి విలక్షణ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంట్లో మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన పోస్టర్లు, టీజర్  సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఎప్పుడో జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ, వాయిదా పడుతూ వచ్చింది. అయితే 'పుష్ప 2' పోస్ట్ పోన్ అవడంతో ఆగస్ట్ 15వ తారీఖున విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావితున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జియో స్టూడియోస్ సమర్పణలో స్టూడియో గ్రీన్‌, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. 


Also Read: 2025 సంక్రాంతి స్లాట్ కోసం పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్.. ఏయే సినిమాలు పోటీలో ఉన్నాయంటే?


గోట్:
దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గోట్ - ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' (GOAT - Greatest Of All Time). ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది.  AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సెప్టెంబర్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. 


వెట్టయాన్‌:


సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'వెట్టయాన్‌'. జై భీమ్ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో 'వేట‌గాడు' అనే టైటిల్ తో రాబోతోంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటుగా ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దసరా స్పెషల్ గా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


కంగువ:


తమిళ హీరో సూర్య, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ మూవీ 'కంగువ'. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, పెన్ స్టూడియోస్ సంస్ధలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సినిమాని విజయ దశమి కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్లలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.  


విదా ముయార్చి:


అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విదా ముయార్చి'. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో అర్జున్ సర్జా, త్రిష, రెజీనా కసాండ్రా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ అల్లిరాజా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. 


అమరన్‌:


తమిళ హీరో శివకార్తికేయన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్‌'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్‌ కుమార్‌ పెరియసామి ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ వార్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ & సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విశ్వ నటుడు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని కుదిరితే ఆగస్టులో లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇలా ఈ ఏడాది సెండాఫ్ లో తమిళ స్టార్ హీరోలు నటిస్తున్న పలు ఆసక్తికరమైన సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇవన్నీ ఇతర భాషల్లోనూ విడుదల కానున్నాయి. మరి వీటిల్లో ఏవేవి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని, కోలీవుడ్ బాక్సాఫీస్ కు కళ తీసుకొస్తాయో వేచి చూడాలి. 


Also Read: స్టార్ హీరోయిన్ల ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్ - వ్యాపారవేత్తలను పెళ్లాడి సెటిలైన ముద్దుగుమ్మలు వీరే, ఆ భామలు మాత్రం బోల్తాపడ్డారు!