ప్రపంచంలో ప్రతీ ఏటా అత్యధిక సినిమాలు రిలీజ్ అవుతున్న దేశం ఇండియా అంటే మీరు నమ్ముతారా. అవును మీరు విన్నది నిజమే.. భారతదేశంలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో సుమారు 1,800 సినిమాలు విడుదల అవుతున్నాయట. అలాగే గత దశాబ్ధం నుంచీ కూడా ఇండియన్ సినిమాల మార్కెట్ కూడా బాగా పెరిగింది. అందుకే సినిమా నిర్మాణ విలువలు కూడా పెరుగుతున్నాయి. సినిమా కోసం ఖర్చు పెట్టడానికి నిర్మాతలు కూడా వెనకాడటం లేదు. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. నటీనటుల రెమ్యునరేషన్, కాస్ట్యూమ్ డిజైన్లు, సెట్లు, వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల కాలంలో అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఏంటో చూద్దాం..


‘ప్రాజెక్ట్-కె’..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాకు ‘మహానటి’ మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీను సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. బహుశా భారతదేశంలో అత్యంత ఖరీదైన మూవీగా ‘ప్రాజెక్ట్ కె’ ను చెప్పొచ్చు.



  • ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.

  • ఈ మూవీలో మరో కీలక పాత్రలో నటిస్తోన్న కమల్ హాసన్ కూడా దాదాపు రూ.20 కోట్లు తీసుకున్నారని సమాచారం.

  • హీరోయిన్‌గా నటిస్తోన్న దీపికా పదుకోణ్ రూ.10 కోట్లు తీసుకుంటుందట.

  • అమితాబ్ బచ్చన్, దిశా పటానీ 20 కోట్లు చొప్పున తీసుకుంటున్నారని తెలిసింది.

  • ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు కలిపి మరో రూ.30 కోట్లు నుంచి రూ.50 కోట్లు ఉండొచ్చు.

  • ఇక సినిమా నిర్మాణం విలువ అన్నీ కలపుకొని మూవీ బడ్జెట్ రూ.600 కోట్లకు చేరినట్లు తెలిసింది.


‘ఆదిపురుష్’..


ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు. ఈ మూవీలో తారాగణానికి కూడా భారీగానే చెల్లించారట మేకర్స్. అయితే మూవీపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అనుకున్నంత వసూళ్లు సాధించలేకపోయింది. 


‘ఆర్ఆర్ఆర్’..


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. దీంతో ఈ మూవీ పూర్తయ్యే సరికి బడ్జెట్ సుమారు రూ.500 కోట్లు అయ్యిందని టాక్. 


‘రోబో 2.0’


దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘రోబో’. ఈ మూవీకు సీక్వెల్ గా వచ్చిన మూవీ ‘రోబో 2.0’. ఈ సినిమాలో గ్రాఫిక్స్, విఎఫెక్స్ ప్రధానంగా ఆకర్షిస్తాయి. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేశారట. 


అలాగే రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా వచ్చిన ‘బ్రహ్మాస్త’ సినిమా కూడా దాదాపు రూ.410 కోట్లతో రూపొందించారు. ఇంకా అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రూ.310 కోట్లతో నిర్మించగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 1, 2’ సినిమాలకు రూ.250 కోట్లు ఖర్చు చేశారట. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ మరింత పెరుగుతుందనే చెప్పొచ్చు. అయితే భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు కూడా వస్తాయంటున్నారు మూవీ పండితులు. ఏదేమైనా ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకీ పెరగడం భారతీయులకు గర్వకారణమనే చెప్పాలి. 


Also Read: ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి కొత్త అప్డేట్ - నైట్ ఎఫెక్ట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్!