ఇన్ టైమ్ (In time) 2011లో విడుదలైన అమేరికన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. ఇది అలాంటి ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కాదు. సరికొత్త కాన్సెప్ట్‌తో, ఏ మాత్రం బోర్ కొట్టకుండా, చివరి వరకూ ఎంటెర్టైన్ చేసే సినిమా. ఈ సినిమాలో మనుషులకు డబ్బు అంటే అక్షరాలా టైమ్. పుట్టగానే చేతిమీద డిజిటల్ క్లాక్‌తో పుడతారు. టైమ్ తోనే వస్తువులను కొనుక్కోవాలి. కష్టపడి పనిచేసి బతకటానికి టైమ్ సంపాదించుకోవాలి. ఆ టైమ్ జీరో అయినపుడు అక్కడికక్కడే మనిషి ఏ నొప్పి లేకుండా మరణిస్తాడు. 25 యేళ్ల వయసు దాటాక వృద్ధ్యాప్యం రాదు. 25లోనే ఉండిపోతారు. ఈ సినిమాలో ముసలివాళ్లు ఉండరు. ఇలాంటి ఎన్నో విచిత్రాలు ఈ సినిమాలు ఉన్నాయి. అసలు కథేంటో చూద్దాం. 


అది 2169వ సంవత్సరం. ప్రజలందరూ వృద్ధాప్యమేది ఇక రాకుండా జెనెటిక్ ఇంజినీరింగ్ చేయబడతారు. 25 సంవత్సరాల వచ్చాక అందరికి వయసు పెరగటం ఆగిపోతుంది. వాళ్లకు ఫ్రీగా ఒక సంవత్సరం కూడా వస్తుంది. అదెలా అంటే ప్రతి ఒక్కళ్లకీ చేతి మీద డిజిటల్ క్లాక్ ఉంటుంది. అది ఆ మనిషి బతకటానికి ఇంకెంత సమయముందో చూపిస్తుంది. మనుషులు ఈ సమయాన్ని పెంచుకోవాలంటే.. కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు ఎలా సంపాదిస్తామో అలాగే వీళ్లు పని చేసి, సమయాన్ని సంపాదించుకోవాలి.


ఏదైనా కొనాలంటే డబ్బులకు బదులు టైం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టీ కొనాలంటే 2 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేయాలి. మనుషులు ఒకర్నుంచి ఒకరికి టైం ట్రాన్స్ఫర్ చేసి వేరే వాళ్లకు బతికే టైం పెంచొచ్చు. చేతి మీద టైమర్ జీరో అయినప్పుడు మనిషి ఏ నొప్పీ కలగకుండా అక్కడికక్కడే చనిపోతాడు. అంతా సాఫీగా ఉంది కదా అని మీకు అనిపించొచ్చు. అక్కడే ట్విస్ట్ ఉంది. 


ఇక్కడి ప్రజల్లో పేదవాళ్ళంతా ఒక చోట కష్టపడి పనిచేస్తూ బతకటానికి ఒక్కో గంటను పోగేసుకుంటూ అవస్థపడుతుంటారు. మరో చోట ధనవంతుల చేతికి ఎంత కాలమైనా తరిగిపోని టైంతో చావనేదే లేకుండా విలాసంగా బతుకుతారు. వీళ్లు టైంను లోన్ గా కూడా ఇస్తుంటారు. ఇందుకు బ్యాంకులు కూడా ఉంటాయి. ధనవంతులు అవసరాన్ని మించి ఇంకా ధనవంతులుగా, పేదలు ఇంకా పేదవాళ్లుగా తయారుచేసే క్యాపిటలిస్టిక్ భావజాలాన్ని డైరెక్టర్ విభిన్న శైలిలో చూపించాడనిపిస్తుంది. అంతేగాక, మనుషులకు టైం విలువ తెలిస్తే అది వృథా కాకుండా కాపాడుకోవటానికి ఎంత విలువిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. 


ఈ సినిమాలోని హీరో విల్ పేదల వర్గానికి చెందినవాడు. చాలా తెలివైనవాడు. న్యూ గ్రీన్విచ్ అనేది ధనవంతులు ఉండే చోటు. వాళ్లంతా ధరలు పెంచుతూ ఆ విధంగా పేదలు బతికే సమయాన్ని దోచుకుంటూ బతుకుతారు. విల్ తన తల్లికి టైం ట్రాన్స్ఫర్ చేయటానికి ఒక్క క్షణం ఆలస్యమయ్యి తన చేతిలోనే మరణిస్తుంది. అలా ప్రతీకారం తీర్చుకోవటానికి అతనొకరోజు ధనవంతులు ఉండే చోటుకు వెళ్ళి ఫిలిప్‌ను, అతని కూతురు సిల్వియానూ కలుస్తాడు. అతనితో పోకర్ ఆడి చాలా సమయాన్ని గెలుచుకుంటాడు.


సిల్వియా అతన్ని ఇష్టపడి పార్టీకి పిలుస్తుంది. అక్కడ లియోన్ అనే వ్యక్తి విల్ దగ్గరున్న టైం ను బలవంతంగా జప్తు చేస్తాడు. విల్ అప్పుడు సిల్వియాను కిడ్నాప్ చేసి తను ఉండే చోటుకు తీసుకెళ్తాడు. పేదలందరికీ బతకటానికి 1000 సంవత్సరాల టైం ట్రాన్స్ఫర్ చేయాలని అప్పుడే తన కూతుర్ని పంపుతానని విల్ డిమాండ్ చేస్తాడు. సిల్వియా కూడా విల్ కు సహకరిస్తుంది. తండ్రి టైం బ్యాంకులను దొంగిలించటానికి సహాయపడుతుంది. ఇలా "Steal from the rich give to the poor" అన్న సిద్ధాంతంతో ధనవంతుల దగ్గర దొంగిలించి, పేదలకు పంచుతారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో ఉండేది. ఇటీవలే దీన్ని తొలగించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో రెంట్‌కు ఉంది.


Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది