Animal Movie Making Video: ఒక సినిమా స్క్రీన్‌పై చూసేటప్పుడు ఎంత బాగుంటుందో.. దానిని షూట్ చేసేటప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మంచు ప్రాంతాల్లో షూట్ చేసిన సీన్స్ థియేటర్లలో స్క్రీన్‌పై చూడడానికి ఎంత అందంగా ఉంటాయో.. వాటిని షూట్ చేయడానికి ఆర్టిస్టులు అంతే కష్టపడాలి. ‘యానిమల్’లో ‘హువా మే’ పాట షూటింగ్ సమయంలో కూడా రణబీర్, రష్మిక అదే విధంగా కష్టపడ్డారు. ఇప్పటికే ఆ సాంగ్ షూటింగ్ ఎలా జరిగిందో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది రష్మిక. తాజాగా ‘హువా మే’ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో బయటికొచ్చింది.
మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది..
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ సినిమాలోని ప్రతీ అంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మూవీలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ లవర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ‘యానిమల్’లో అన్నింటి కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాట ‘హువా మే’. ఈ పాటను కశ్మీర్ లాంటి మంచు ప్రాంతంలో షూట్ చేశారు. స్క్రీన్‌పై ఈ సాంగ్ చూడడానికి చాలా బాగుంది. అందుకే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో తాజాగా బయటికొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా ఇబ్బందిపడ్డాం..
మంచు ప్రాంతాల్లో సినిమాలు షూట్ చేయడం అంత సులభం కాదు. ‘హువా మే’ పాట షూటింగ్ సమయంలో తాను, రణబీర్ ఎంత కష్టపడ్డారో రష్మిక బయటపెట్టింది. ‘‘ఈ సాంగ్‌లో నేను చీరలో, రణబీర్ కుర్తాలో మాత్రమే కనిపించాలి. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే సీన్ కావడంతో చలి నుంచి కాపాడే ఎలాంటి దుస్తులు వేసుకోవద్దని దర్శకుడు చెప్పాడు. అందుకే మేం స్వెటర్లు వేసుకోలేదు. రణబీర్ కుర్తా, నేను చీరలో ఉన్నాం. కానీ, అక్కడ ఉన్న చలికి చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూట్ చేస్తున్నంత సేపు పడిన బాధ చెప్పలేం. చర్మం పూర్తిగా డ్రై అయ్యింది. మేకప్ ఆర్టిస్టులు దాన్ని కవర్ చేసేందుకు మరింత మేకప్ వేయాల్సి వచ్చింది. జుట్టు కూడా పొడిబారిపోయింది. మళ్లీ మళ్లీ హెయిర్ సెట్ చేయాల్సి వచ్చింది’’ అంటూ తమ కష్టాన్ని చెప్పుకొచ్చింది రష్మిక.
మరింత వైలెంట్‌గా సీక్వెల్..
‘యానిమల్’ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ లభించిందో.. అంతే విమర్శలు కూడా వచ్చాయి. ఇందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆడవారిపై హింసను ప్రోత్సహిస్తున్నట్టుగా చూపించాడని, విపరీతమైన వైలెన్స్ ఉందని.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారు బయటపెట్టారు. అభిప్రాయాలు బయటపెట్టే క్రమంలో ఎవరైనా మితిమీరిన విమర్శలు చేస్తే వారికి సందీప్ నేరుగా కౌంటర్ ఇచ్చాడు. ‘యానిమల్’కు ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా దాని సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ను మరింత వైలెంట్‌గా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు సందీప్.