YSRCP Parliament Seats: టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీ (Actor Ali) వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని, సీఎం జగన్ ఎక్కడి నుంచి టికెట్ కన్ఫార్మ్ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానంటూ అలీ ప్రకటించారు. అయితే అసెంబ్లీకి కాకుండా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలీ ఆసక్తి చూపిస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ టికెట్లు కేటాయిస్తున్నారు.


అలీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉండే నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాల నుంచి బరిలోకి దించాలని జగన్ చూస్తున్నారు. అయితే అలీది సొంత ప్రాంతం రాజమండ్రి కావడంతో.. అక్కడ నుంచి పోటీలోకి దింపే ఆలోచన కూడా జగన్ దృష్టిలో ఉంది.


ఆ మూడింటిలో ఓ చోట నుంచి బరిలోకి
దీంతో ఆ మూడింటిలో ఏదోక నియోజకవర్గం నుంచి అలీ వైసీపీ తరపున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మరో కొత్త వార్త వినిపిస్తోంది. కడప పార్లమెంట్‌లో కూడా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా అలీని బరిలోకి దింపే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. అయితే అవినాష్ రెడ్డిని ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ చూస్తోంది. దీంతో ఆయన స్థానంలో అలీ లేదా అంజాద్ బాష పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. ఇక కడప అసెంబ్లీ స్థానాన్ని రెడ్డి లేదా బలిజలకే కేటాయించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో అలీతో జగన్ భేటీ కానున్నారని, ఎంపీ సీటుపై క్లారిటీ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


నంద్యాలలో అలీ పర్యటనలు 
అలీకి నంద్యాల పార్లమెంట్‌ను ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు గతంలో ప్రచారం సాగింది. దానికి బలం చేకూరేలా అలీ నంద్యాల పార్లమెంట్ పరిధిలో పర్యటనలు చేశారు. కానీ ఇటీవల వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై జగన్ స్పీడ్ పెంచారు. సిట్టింగ్ ఎంపీలలో పలువురిని మార్చేసి కొత్తవారిని ఇంచార్జ్‌లుగా ప్రకటిస్తున్నారు. సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నారు. అలీ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో పోటీలోకి దిగాలని సూచినా సీటు ఇవ్వలేదు. దీంతో పార్టీ కోసం అలీ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అలీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని, దాదాపు ఖాయమని గతంలో ప్రచారం జరిగింది. అలీ దంపతులు వెళ్లి జగన్‌ను కలవడంతో రాజ్యసభ సీటు ఖాయమని వార్తలొచ్చాయి.  కానీ ఆ తర్వాత అలీకి కాకుండా వేరేవారికి రాజ్యసభ సీటు కేటాయించారు.


రాజ్యసభ సీటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న అలీకి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా జగన్ అవకాశం కల్పించారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనలో అలీ ఉన్నారు. ఇప్పటికే తన మనస్సులోని అభిప్రాయాన్ని జగన్‌కు చెప్పారు. జగన్ కూడా టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. దీంతో అలీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.