హిట్ యూనివర్స్‌లో తర్వాత ఏం జరుగుతుందో అని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మొదటి భాగం హీరో విష్వక్‌సేన్ అన్నారు. తనకు కూడా ఫోన్ వస్తుందేమో చూడాలని తెలిపారు. సోమవారం జరిగిన హిట్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.


ఈ సందర్భంగా  రాజమౌళి గురించి మాట్లాడుతూ ‘ప్రపంచంలో తెలుగు సినిమాను రిప్రజెంట్ చేసినందుకు థ్యాంక్స్. మీ కారణంగా మాకు చెన్నై, ముంబైల్లో చాలా రెస్పెక్ట్ పెరిగింది. మా జాబ్ చాలా ఈజీ అయింది. మాకు మర్యాద కూడా పెరిగింది. అందులో మేం పీకింది ఏమీ లేదు కానీ మీరు చేసిన ఒక్క సినిమాతో మాకు ఇచ్చే మర్యాద మారింది.’ అన్నారు.


ఆ తర్వాత మాట్లాడుతూ... ‘వాల్ పోస్టర్‌ సినిమాలో నాకు చాన్స్ ఇచ్చిన నానికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ పార్ట్ విషయంలో చాలా జరిగిపోయాయి. జనతా కర్ఫ్యూ రావడం, ఓటీటీల్లో రిలీజ్ కావడం జరిగాయి. ఆ తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేశారు. నాకు ఫలక్‌నుమా దాస్‌కు ఎంత పేరొచ్చిందో ఆ హీట్ తగ్గకముందే హిట్‌కు కూడా అంతే పేరొచ్చింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆ సినిమాతోనే బతికాం. ఎందుకంటే రెండేళ్లు ఇంట్లోనే ఉన్నాం.’


‘నిర్మాత ప్రశాంతి చాలా స్వీట్ పర్సన్. ఈరోజు ఈ ఫంక్షన్ చూస్తుంటే మీ టీం మొత్తాన్ని మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. శైలేష్ చాలా క్లారిటీ ఉన్న మనిషి. సీన్ తీశాక సరిగ్గా వచ్చిందా లేదా అని కన్ఫ్యూజన్ ఉండదు. కచ్చితంగా ఈ సినిమా భయపెడుతుంది. థియేటర్లో వైబ్రేషన్ ఎలా తీసుకురావాలో శైలేష్‌కు తెలుసు. మూవీ మిమ్మల్ని కచ్చితంగా థ్రిల్ చేస్తుంది. హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నాకు కూడా ఫోన్ వస్తదేమో.’ అన్నారు.


శేష్ గురించి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో మన లెవల్ పిచ్చి మ్యాచ్ చేసే వాళ్లు కొంతమంది ఉంటారు. అందులో శేష్ ఉంటాడు. ఇది నా పని కాదు అని మనం ఎప్పుడూ పారిపోం. అన్నీ మన నెత్తినే వేసుకుంటాం. నాకంటే ముందు నుంచి నాకు శేష్ కనిపిస్తున్నాడు. నీ సక్సెస్ రేట్ ఎక్కడా తగ్గలేదు. నా ఫేవరెట్ యాక్టర్లలో, రైటర్లలో శేష్ ఒకడు. నీకు కూడా ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 2వ తేదీన సినిమా చూడటానికి నేను కూడా వెయిట్ చేస్తున్నా’ అంటూ ముగించాడు. ‘నాకు హిట్‌లో ఒక పాట కూడా లేదు. కానీ శేష్‌కి పాట, రొమాంటిక్ సీన్లు పెట్టావు. ఇదెక్కడి న్యాయం.’ అంటూ శైలేష్‌ను ఆట పట్టించాడు.