ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి తాను ఏకలవ్య శిష్యుడిని అని ’హిట్ 2’ హీరో అడివి శేష్ అన్నారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానని తెలిపారు. సోమవారం జరిగిన హిట్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...


‘ఇవాళ చాలా నెర్వస్‌గా ఉన్నా. ఏం చెప్పాలో మర్చిపోకుండా చేతి మీద రాసుకుని వచ్చా. ముందుగా మీ అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారిని నేను అతిథులు అనను, కుటుంబ సభ్యులు అంటాను. వీరంతా నా కెరీర్ ప్రారంభం నుంచి నాతోనే ఉన్నారు. ఈ సినిమాకు పని చేసిన వారందరికీ థ్యాంక్యూ.’


‘ఇక్కడికి అనుష్కను సర్‌ప్రైజ్‌గా తీసుకువద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన గెస్ట్‌లు అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. మేమంతా బయట నుంచి ఇండస్ట్రీకి వచ్చి, కష్టపడి, సాధించి ఈరోజు మీ ముందు నిలబడ్డాం. విష్వక్ లాంటి హీరో హిట్‌తో హిట్ కొట్టి, తన సినిమాతో ధమ్కీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు(నవ్యుతూ).’


‘నా అభిమాన నటుడు నానినే. ఆయనకు ఈ విషయం తెలుసో లేదు తెలీదు. కానీ నేను మాత్రం చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. అష్టా చెమ్మా నుంచి దసరా వరకు వేర్వేరు రోల్స్, గెటప్స్‌తో అలరిస్తున్నాడు. నాని సినిమా నచ్చని వాడు, నాని నచ్చని వాడు ఉండడు నాతో సహా.’


‘నేను బాహుబలి సెట్‌లో 70 నుంచి 100 రోజులు ఉన్నాను. రానా విగ్రహం నిలబెట్టే సమయంలో రమా రాజమౌళితో మాట్లాడుతూ ఈ సినిమా ఆడుతుందంటావా అన్నారు. నేను ఒక్కసారిగా షాకైపోయాను. మగధీర, ఈగ లాంటి సినిమాలు చేసిన దర్శకుడు ఇలా మాట్లాడుతున్నాడా అనుకున్నాను. ఎప్పటికైనా నేర్చుకోవాలి, ఎప్పటికీ స్టూడెంట్‌గానే ఉండాలి అనేది నేను రాజమౌళి దగ్గర నేర్చుకున్నాను. మనం అందరి కంటే ఎక్కువ పని చేస్తేనే అందరూ మన మాట వింటారనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను.’


‘ఇప్పుడు నేను చేస్తున్న వర్క్, నా వర్క్ అప్రోచ్‌కి మూల కారణం బాహుబలి. నాకు తెలిసీ తెలియని సమయంలో ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయనే నా ఫిల్మ్ స్కూల్. ఎంత దగ్గరైనా ఆయనతో మాట్లాడే చనువు నాకు రాదు. రానా, నానిలా రాజమౌళితో చనువుగా మాట్లాడాలని ఉంటుంది. కానీ గురువుతో శిష్యుడు అలా ఉండచ్చా అనే విషయం దగ్గర ఆగిపోతాను. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని. ఆయనకు తెలియకుండానే ఆయన వర్క్ చూసి నేర్చుకున్నాను.’


‘మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనవాడ్ని మర్చిపోకూడదు అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి సినిమా తర్వాత అది ఆడియన్స్‌కు నచ్చుతుందా లేదా అని తపన పడుతూనే ఉంటాను. ప్రతిసారీ సక్సెస్ అవుతానో లేదో తెలియదు కానీ ప్రయత్నం మాత్రం 100 శాతం ఉంటుంది.’


‘ప్రతి సినిమాకి కష్టపడ్డట్లే ఈ సినిమాకి కూడా కష్టపడ్డాను. కానీ ఈసారి నేను కథ రాసుకునే బదులు తన హిట్ వర్స్‌లో భాగం అయ్యాను. దానికి చాలా ఆనందంగా ఉంది. హిట్-3లో కూడా నేను ఉన్నానని శైలేష్ నాకు చెప్పాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ 2వ తేదీన మీరందరూ థ్రిల్ అవుతారు. హిట్ 2ని హిందీలో కూడా డబ్ చేస్తున్నాం. అయితే సినిమాలో ట్విస్ట్‌లను మాత్రం రివీల్ చేయకండి.’ అంటూ ముగించారు.