Hina Khan Diagnosed With Stage 3 Breast Cancer: గతంలో సినీ ప్రముఖులు తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను బయటకు చెప్పేవాళ్లు కాదు. కానీ, ఈ రోజుల్లో సినీ సెలబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నటి పూనమ్ పాండే క్యాన్సర్ గురించి చర్చ జరిగేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. అయితే, తాజాగా హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ తనకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు వెల్లడించింది. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పింది. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇంతకీ హీనా ఏం చెప్పిందంటే.?
ప్రస్తుతం తాను కఠిన పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పిన హీనా.. త్వరలోనే ఈ బాధ నుంచి బయటపడతాని ఆశాభావం వ్యక్తం చేసింది. “అందరికీ నమస్కారం. నన్ను అభిమానించే, నన్ను ప్రేమించే వారందరితో ఓ కీలకమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుటున్నాను. నేను ప్రస్తుతం స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను. నా జీవితంలో సవాల్ తో కూడిన టైమ్ ను గడుపుతున్నాను. అయినప్పటికీ ధైర్యంగా ఉన్నాను. త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతాను అనే నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాపై గౌరవాన్ని ఉంచి నా ప్రైవసీకి ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటున్నాను. భగవంతుడి దయ, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో త్వరలోనే పూర్తిగా ఆరోగ్యంగా మారుతానని నమ్ముతున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పలువురు సినీ, టీవీ ప్రముఖులతో పాటు నెటిజన్లు, ఆమె అభిమానులు హీనా త్వరగా క్యూర్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ హీనా ఖాన్?
హీనా ఖాన్ జమ్మూకాశ్మీర్ లో పుట్టి పెరిగింది. 2009లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'హే రిస్తా క్యా ఖేల్తా హై' సీరియల్ తో బుల్లితెర ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8’, ‘బిగ్ బాస్’ 11 రియాలిటీ షోలలో పాల్గొన్నది. ‘నాగిన్ 5’,’ షద్యంత్రా’ సహా పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించింది. మరికొన్ని సీరియల్స్ లో గెస్ట్ రోల్స్ కూడా పోషించింది. ప్రస్తుతం ‘నామాకూల్’ అనే వెబ్ సిరీస్ లో చేస్తోంది. ఈ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతుంది. సీరియల్ నటిగా కొనసాగుతున్న సమయంలోనే ప్రొడ్యూసర్ రాఖీ జైశ్వాల్ తో ప్రేమలో పడింది. 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. గతంలోనే తనకు ఆస్తమా సమస్య ఉన్నట్లు చెప్పిన హీనా, ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ ఉందని చెప్తూ అందరినీ షాక్ కి గురి చేసింది.