Hero Vikram: ఈసారి స్వాతంత్య్ర దినోత్సవానికి ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాలు పోటీపడడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ కూడా ఒకటి. ‘తంగలాన్’ ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇందులో విక్రమ్‌తో పాటు ప్రతీ యాక్టర్ లుక్స్ పరంగా చాలా మారిపోయారు. అంతే కాకుండా అస్సలు అనుకూలించని పరిస్థితుల్లో షూటింగ్ చేశామని, మేకప్ కోసం చాలా కష్టపడ్డామని ఇప్పటికే బయటపెట్టారు మేకర్స్. తాజాగా జరిగిన ‘తంగలాన్’ ఆడియో లాంచ్‌లో ఈ మూవీ కోసం తాను ఎంత కష్టపడ్డాడో ప్రేక్షకులతో పంచుకున్నారు విక్రమ్.
పదిశాతం మాత్రమే..
‘‘నేను సేతు, పితమగన్, అన్నియన్, ఐ, రావణన్ లాంటి సినిమాలు చేశాను. అన్నింటిలో చాలా కష్టపడ్డాను. కానీ నిజం చెప్పాలంటే తంగలాన్ కోసం నేను పడిన కష్టంలో అవి కేవలం 8 నుంచి 10 శాతం మాత్రమే’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విక్రమ్. ‘తంగలాన్’లో తను టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర గురించి కూడా విక్రమ్ వివరించారు. ‘‘నేను తంగలాన్‌కు మానసికంగా చాలా కనెక్ట్ అయ్యాను. అతడొక లీడర్, ఒక యోధుడు.. ఇంకా మరెన్నో. కానీ ఏదైనా సాధించాలనే పట్టుదల తనలో ఎక్కువగా ఉంటుంది. అదే తనలోని ప్రత్యేకత. తన చుట్టూ ఉన్నవారంతా తన వల్ల కాదని చెప్తూ ఉన్నా కూడా తన వల్ల అవుతుందని నమ్ముతాడు. అలాగే నేను కూడా నమ్మాను’’ అని చెప్పుకొచ్చారు విక్రమ్.
హాస్పిటల్స్‌కు తిరిగాను..
‘‘నేను నా జీవితంలో యాక్టింగ్ మాత్రమే చేయాలనుకున్నాను. నేను కాలేజ్‌లో పాల్గొన్న ఒక నాటకంలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోగానే నా కాలు విరగ్గొట్టుకున్నాను. మూడేళ్లు హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. 23 సర్జరీలు జరిగాయి. కర్ర పట్టుకొని నడిచేవాడిని. నేను అసలు సరిగ్గా నడవడమే కష్టమని డాక్టర్లు చెప్పారు. కానీ నాకు పిచ్చి. నేను మళ్లీ కాస్త నడవడం ప్రారంభించి నాకు యాక్టింగ్ అవకాశాలు రాగానే అంతా ఓకే అయిపోతుంది అనుకున్నాను. కానీ ఆ తర్వాత వరుసగా పదేళ్లు ఫెయిల్యూర్స్ మాత్రమే చూశాను. అందరూ నా వల్ల కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ నా కల కొనసాగింది. నా కష్టం కొనసాగింది. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్‌పై ఉన్నాను. ఇలాంటి ప్యాషనే తంగలాన్‌కు కూడా ఉంటుంది’’ అని వివరించారు విక్రమ్.
కష్టపడుతూనే ఉంటాను..
‘తంగలాన్’ ఆడియో లాంచ్‌లో తనకు నిరంతరం సపోర్ట్ చేస్తూ, ప్రేమను అందిస్తున్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నారు విక్రమ్. ఒకవేళ ఆయనకు మళ్లీ సక్సెస్ రాకపోతే ఎలా ఉంటుందో తెలిపారు. ‘‘ఒకవేళ సక్సెస్ రాకపోతే.. సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఇంకా కష్టపడుతూనే ఉంటాను అనుకుంటా’’ అని నవ్వుతూ చెప్పారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తంగలాన్’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమయ్యింది. మాళవికా మోహనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ బ్యూటీ పార్వతీ ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read: ‘తంగలాన్’ వల్ల ఐదుగురు డాక్టర్లను కలిశాను... ఒళ్లంతా మంట - మాళవికా మోహనన్