నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాలలో 'జెర్సీ' ఒకటి. నటుడిగా ఆయన్ని మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. 2019లో 'మళ్ళీరావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. అందుకే ఈ మూవీ మీద బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ మనసు పడ్డాడు. 


'అర్జున్ రెడ్డి' వంటి తెలుగు రీమేక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్.. ఈసారి 'జెర్సీ' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు. మాతృకని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. కరోనా పాండమిక్ కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్ లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. 


'జెర్సీ' విడుదలై దాదాపు కావొస్తున్నా ఈ సినిమా ప్లాప్ అవడం గురించి హీరో షాహిద్ కపూర్ ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దీనిపై మాట్లాడిన ఆయన, మంచి కంటెంట్ ఉన్న సినిమాను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేమన్నారు. "నా హృదయం ముక్కలైనట్లు అయింది. అది ఎంతో మంచి సినిమా. కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా. 'జెర్సీ'తో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్ ఫుడ్ లాంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి. దాన్ని వాయిదాలు చేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. సాంగ్స్ రిలీజ్ అయిన మరో నాలుగు నెలలకు మా సినిమా విడుదల అయ్యింది. అప్పుడు కోవిడ్ టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్ అయింది" అని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.


ఇటీవల నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ సైతం 'జెర్సీ' హిందీ రీమేక్ డిజాస్టర్ గా మారడంపై విశ్లేషించారు. 'కేజీఎఫ్ 2' లాంటి యాక్షన్ మూవీకి పోటీగా దించడం మైనస్ అయిందో.. కోవిడ్ కారణంగా పలుమార్లు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అలా జరిగిందో తెలియడం లేదని అన్నారు. ‘జెర్సీ’ అనేది చాలా మంచి సినిమా అని.. కానీ సరైన విధంగా రిలీజ్ చేయలేకపోయామని నిర్మాత అభిప్రాయ పడ్డారు. 


'జెర్సీ' సినిమా విషయానికొస్తే.. ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జీవితంలో ఓడిపోయిన అతను, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? అనే లైన్ తో తెరకెక్కింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషించారు. హిందీ 'జెర్సీ' మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 


Also Read : ఇదీ 'నాటు నాటు' మూమెంట్ అంటే - ఆస్కార్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లైవ్ డ్యాన్స్