Ramoji Rao Net Worth And Assets: ఈనాడు అధినేత రామోజీ రావు మరణం సినీ పరిశ్రమను, మీడియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున రామోజీ రావు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో రామోజీ రావు ఆస్తుల వివరాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్థాపించిన సంస్థలు, వాటి వల్ల ఆయన సంపాదించిన ఆస్తుల గురించి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
బుల్లితెరపై రికార్డ్..
చెరుకూరి రామోజీ రావు.. రామోజీ గ్రూప్ అనే అతిపెద్ద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎంటర్‌టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు మరెన్నో సంస్థలు ప్రారంభమయ్యాయి. 1936 నవంబర్ 16న జన్మించిన రామోజీ రావు.. స్వయంగా ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ నెట్‌వర్క్, ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌజ్, ఈటీవీ భారత్‌ను ప్రారంభించారు. ముందుగా 1974లో విశాఖపట్నంలో ఈనాడు వార్తా పత్రికను ఆరంభించారు. ఆ తర్వాత ఈటీవీ నెట్‌వర్క్ ప్రారంభమయ్యి ఇది పూర్తిగా 8 భాషల్లో విస్తరించింది. కేవలం తెలుగులో ఈటీవీకి 12 ఛానెల్స్ ఉన్నాయి. ఈ ఛానెల్స్ ద్వారా ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఎన్నో అవార్డులు..
ఈటీవీ ఛానెల్‌తో బుల్లితెరను శాసించిన రామోజీ రావు.. ఉషా కిరణ్ మూవీస్‌తో వెండితెరపై కూడా అడుగుపెట్టారు. ఈ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ఎన్నో భాషల్లో దాదాపు 80కు పైగా సినిమాలను నిర్మించారు. ఇక కొన్నేళ్లుగా డిజిటల్ మీడియా అనేది ట్రెండింగ్‌లోకి రావడంతో, ప్రజలంతా దాన్నే ఫాలో అవ్వడంతో రామోజీ రావు కూడా ఈటీవీ భారత్ అనేది ఒక డిజిటల్ యాప్‌ను తయారు చేయించారు. ప్రారంభించిన కొన్నిరోజుల్లోనే బాగా పాపులర్ అయిన ఈటీవీ భారత్.. ప్రస్తుతం 24 రాష్ట్రాల్లో 13 భాషల్లో వార్తలను ప్రజలకు అందిస్తోంది. ఇక రామోజీ రావు పేరున ఎన్నో అవార్డులు కూడా ఉన్నాయి. 2016లో ఆయనుకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. 2000లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘నువ్వే కావాలి’ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆయన ఖాతాలో 4 ఫిల్మ్‌ఫేర్, 5 నంది అవార్డులు కూడా ఉన్నాయి.
మిలియన్ల డాలర్లు..
2021 నాటికి రామోజీ రావు ఆస్తుల విలువ రూ.37,583 కోట్లు ఉన్నట్లు అని సమాచారం. ఆస్తుల విషయం పక్కన పెడితే.. ఆయన నెలకొల్పిన సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరం వాళ్లకు మాత్రమే కాకుండా ఈతరం ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలను తెరకెక్కించింది ఉషా కిరణ్ మూవీస్. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది దర్శకులుగా, యాక్టర్లుగా పరిచమయ్యి ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. ఇక ఇప్పటికీ ఈటీవీ అనేది పేరు కాదని అదొక బ్రాండ్ అని ఆయన అభిమానులు అంటుంటారు. వార్తా పత్రికలు చదివే రోజులు పోయాయి అని చాలామంది భావిస్తున్నా ఇప్పటికీ ఈనాడు పత్రికకు మంచి సర్కులేషన్ ఉంది. మీడియా, ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా.. వివిధ వ్యాపారాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ప్రియా పచ్చళ్ల నుంచి.. కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ వరకు.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. నమ్మకానికి మారుపేరు అయ్యారు.
Also Read: బోరున విలపించిన దర్శకేంద్రుడు, రామోజీ రావుకు భారతరత్న ఇవ్వాలంటూ రాజమౌళి భావోద్వేగం