కొందరు సౌత్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే.. ప్రేక్షకులంతా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ హీరోల రెమ్యునరేషనే ఈ రేంజ్‌లో ఉంటే.. వారి ఆస్తుల విలువ ఇంకా ఎంత ఉంటుందో అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఆస్తిపరుడైన హీరో ఎవరు అనే విషయం బయటపడింది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, రామ్ చరణ్, కమల్ హాసన్‌లాంటి హీరోలు ఉన్నాయి. అయితే, వీరందరి కంటే అత్యధిక ఆస్తులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో ఎవరో తెలుసా? ఆయన మరెవ్వరో కాదు.. టాలీవుడ్ మన్మథుడు, ‘బిగ్ బాస్’ తెలుగు హోస్ట్ అక్కినేని నాగార్జున. 


వందల కోట్ల రెమ్యునరేషన్..


గత కొంతకాలంగా సీనియర్ హీరోలు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడమే కాకుండా.. ఆ సినిమాల ద్వారా హిట్లు కూడా అందుకుంటున్నారు. అందుకే చాలావరకు సీనియర్ హీరోలంతా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదే లే అంటున్నారు. ఇటీవల ‘జైలర్’తో హిట్ అందుకున్న రజినీకాంత్.. కేవలం ఆ ఒక్క సినిమా కోసమే రూ.110 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్నారు. ఇక ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.430 కోట్లు ఉంటుందని సమాచారం. ‘బిగిల్’, ‘మాస్టర్’, ‘బీస్ట్’, ‘లియో’లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్.. ఒక్క సినిమాకు రూ.130 కోట్లను రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేస్తున్నాడట. సీనియర్ హీరో కమల్ హాసన్ కూడా ‘ఇండియన్ 2’ కోసం రూ.150 కోట్లను పారితోషికంగా అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే వీరంతా ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నా ఆస్తుల విషయంలో మాత్రం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జుననే టాప్ స్థానంలో ఉన్నట్టు సమాచారం.


వేల కోట్ల ఆస్తులు..


ప్రస్తుతం అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ దాదాపు రూ.3010 కోట్లు ఉంటుందని ఓ రిపోర్టులో తేలింది. ఈ 64 ఏళ్ల సీనియర్ హీరో ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాత, హోస్ట్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా కూడా తన సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు. తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి నాగార్జున.. దాదాపు 100 సినిమాల్లో నటించారు. ఒక్కొక్క సినిమాకు రూ.9 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా సినిమాలను నిర్మిస్తూ.. నిర్మాతగా కూడా బాగానే సంపాదిస్తున్నారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ లాంటి వాటిలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ఒక కన్వెషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. సినిమాలతో పాటు బ్రాండ్స్ వల్ల కూడా నాగార్జునకు భారీ పారితోషికమే లభిస్తోంది.


నాగార్జున తర్వాత లిస్ట్‌లో ఆ సీనియర్ హీరోలు..


ప్రస్తుతం హైదరాబాద్‌లో నాగార్జున నివసిస్తున్న ఇంటి విలువ దాదాపు రూ.45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక నాగార్జునకు సొంతంగా ఎన్నో లగ్జరీ కార్లు, సౌకర్యవంతమైన బంగ్లాలతో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. రూ.3010 కోట్ల ఆస్తులతో నాగార్జున.. మొదటి స్థానంలో ఉండగా.. రూ.2200 కోట్ల ఆస్తులతో వెంకటేశ్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి తర్వాత రూ.1650 కోట్ల ఆస్తులతో చిరంజీవి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రూ.1370 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.


Also Read: ఆ మాటలు విని, స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ హీరో!