‘డై హార్డ్’ వంటి హాలీవుడ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో బ్రూస్ విల్లీస్ ఇప్పుడు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఫ్రోంటోటెంపోరల్ డిమెన్షియా (ఎఫ్‌టీడీ) అనే వ్యాధితో పోరాడుతున్నారు. అసలు ఈ వ్యాధి విల్లీస్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, తమ జీవితాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాలను తన భార్య హెమింగ్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా బ్రూస్ విల్లీస్ భార్య హెమింగ్ చేసిన పోస్ట్.. చాలామంది నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఎఫ్‌టీడీ అనేది మామూలు డిమెన్షియా లాగా కాదు. సాధారణంగా డిమెన్షియా అనేది వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధి. కానీ అందులోని ఎఫ్‌టీడీ అనే రకంగా మాత్రం మధ్య వయసు ఉన్నవారినే అటాక్ చేస్తుంది. విల్లీస్ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే విల్లీస్ విషయంలో ప్రతీ విషయాన్ని తను జాగ్రత్తగా చూస్తున్నానని హెమింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. డిమెన్షియా ఉన్నవారికి స్పెషల్ కేర్ చూపించడం చాలా మంచిదని చెప్పుకొచ్చింది. తనతో పాటు తన భర్త విల్లీస్ జీవితాన్ని కూడా తను బాగా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది. ఇదంతా ఒక వీడియో ద్వారా హెమింగ్ తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
కన్నీళ్లతో వీడియో షేర్..
‘‘వెలుగు, చీకటిలాంటి ఆలోచనలను దూరం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నాకు తెలుసు నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ నా బెస్ట్ జీవితాన్ని నేను జీవించడానికి ప్రతీరోజు కచ్చితంగా కృషి చేయవలసి వస్తోంది. నేను అది నాకోసం చేస్తున్నాను. నా ఇద్దరు పిల్లలు, బ్రూస్ కోసం చేస్తున్నాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది హెమింగ్. ‘‘అందరూ నేను చాలా బాగున్నాను అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను బాలేను. కానీ నేను నాకోసం, నా కుటుంబం కోసం ముందడుగు వేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మనం బాగా చూసుకోలేకపోతే.. మనం ప్రేమిస్తున్న వారిని కూడా బాగా చూసుకోలేం. నేను నా శక్తికి మించిది చేయడానికే ప్రయత్నిస్తున్నాను’’ అంటూ హెమింగ్.. బ్రూస్ వ్యాధి గురించి, దాని వల్ల తను ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది. అంతే కాకుండా తన ఫాలోవర్స్‌ను బిజీ రోజుల నుంచి బయటికొచ్చి అందమైన విషయాలపై ఫోకస్ చేయమని కోరింది.
అయిదుగురు పిల్లలు..
బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం గురించి హెమింగ్ ఓపెన్‌గా మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. 2022 మార్చిలో విల్లీస్‌కు ఎఫ్‌టీడీ ఉన్న విషయం బయటపడింది. ఆ తర్వాత వెంటనే తను యాక్టింగ్‌కు, సినిమాలకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ సమయంలో తనకు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడని తన కుటుంబం ప్రకటించింది. ప్రస్తుతం హెమింగ్, విల్లీస్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారే మేబుల్ (11), ఎవిలిన్ (9). ఇక విల్లీస్‌కు, తన మాజీ భార్య డెమీ మూరేకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారే రూమర్ విల్లీస్ (35), స్కౌట్ విల్లీస్ (32), తల్లులా విల్లీస్ (29).
Also Read: అనసూయ విడాకులు తీసుకుంటున్నారా? ఏందీ కొత్త గోల?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial