సినిమాలతోనే కాదు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో డైరెక్టర్ వెంకటేష్ మహా. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహా.. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో 'మహేషింతే ప్రతీకారం' రీమేక్ గా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో నటుడిగా బిజీ అయిపోయిన ఆయన, మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయలేదు. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన 'మర్మాణువు' మూవీ గురించి మరో వార్త బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించడం కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారం మొదలుపెట్టి వార్తల్లో నిలిచారు మహా. 


'మర్మాణువు' మూవీ కోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లు వెంకటేష్ మహా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు. గత మూడేళ్ళుగా ఈ సినిమాని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నానని, సాంప్రదాయ పద్ధతుల్లో ఈ సినిమా తీయలేనని గ్రహించానని, అందుకే 'క్రౌడ్ ఫండింగ్' మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ఇదొక డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అని, దీనికి 6.5 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని పేర్కొన్నారు. 'C/o కంచరపాలెం' 5వ వార్షికోత్సవం అయిన సెప్టెంబర్ 7 నుండి ఈ క్రౌడ్ ఫండింగ్ కోసం పోర్టల్‌లు తెరవబడతాయన్నారు. 'నా కొత్త ప్రయాణంలో చేరండి! దయచేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి' అంటూ పెద్ద పోస్ట్ పెట్టారు.


Also Read: చిన్న సినిమాలకు శాపంగా మారుతున్న రీ రిలీజులు?


''అందరికీ నమస్కారం. నేను 'C/o కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' వంటి హృద్యమైన కథలకు జీవం పోసి బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన దర్శక రచయిత వెంకటేష్ మహాను. 'C/o కంచరపాలెం' విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు, కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రం అనిపించుకుంది, అది నేటికీ IMDB లో అత్యధిక రేటింగ్ పొందిన తెలుగు సినిమాలలో 1వ స్థానంలో నిలిచింది. 2022లో నేరుగా నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రీమియర్ కాబడిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' టాప్-టైర్ అడాప్టేషన్‌ గా నిలుస్తుంది. నేను అమెజాన్ ప్రైమ్ వీడియో 'మోడరన్ లవ్ హైదరాబాద్' ఆంథాలజీలో ఒక ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించాను. అలానే ఈ ఏడాది ఒక సినిమాని సమర్పించడమే కాదు, ప్రొడ్యూసర్ గా ఒక సినిమాని నిర్మించాను. అది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు''


''నా అభిరుచిని ప్రతిబింబించే ప్రాజెక్ట్‌తో, ప్రతి మనిషితో లోతుగా కనెక్ట్ అయ్యే సినిమా తీయాలనే నా నిబద్ధతను ప్రతిబింబించే ప్రాజెక్ట్‌తో ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను. ఈ చిత్రాన్ని రూపొందించడానికి గత 3 సంవత్సరాలుగా సాంప్రదాయ పద్ధతుల్లో ప్రయత్నించాను. ఈ చిత్రాన్ని మౌంట్ చేయడానికి ఫిల్మ్ కమ్యూనిటీ నుండి చాలా మంది నన్ను సపోర్ట్ చేసారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే లెక్కలేనన్ని సమావేశాలు, అనేక నేరేషన్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు, అనేక ఒత్తిడితో కూడిన రోజులు గడిపిన తర్వాత, ఈ సినిమా నిర్మాణం సాంప్రదాయ నిబంధనలకు సరిపోదని నేను గ్రహించాను. అందువల్ల, నేను స్వతంత్రంగా చేయడానికి 'క్రౌడ్ ఫండింగ్' మార్గాన్ని ఎంచుకుంటున్నాను''


''ఇంతవరకు నేను చేసిన ఈ అద్భుత దృశ్యాన్ని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావడంలో మీ మద్దతు కోసం ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఉన్నాను. నా వెనుక అద్భుతమైన టీమ్ మెంబెర్స్ ఉన్నారు. ఇప్పుడు మీ మద్దతు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వీలైనంత వరకు తగ్గించి ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రొడ్యూసర్ చేయడానికి రూ. 6.5 కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతుంది. ఇది వాస్తవ బడ్జెట్‌ లో దాదాపు సగం అని చెప్పాలి''


''ఇది 'మర్మాణువు' అనే సినిమా. ఇది సాంప్రదాయక కథ కాదు, కానీ ఖచ్చితంగా ఇదొక షాట్ ఎంటర్టైనర్. ఇది డార్క్ కామెడీ, సైకలాజికల్ డ్రామా అండ్ మిస్టరీ మిక్స్‌డ్ మ్యాజికల్ రియలిజం స్క్రిప్ట్. ఇది మీ హృదయాలను తాకుతుంది. సినిమాటిక్ ల్యాండ్‌ స్కేప్‌లో తనదైన ముద్ర వేసేలా చేస్తుంది. పెద్ద బడ్జెట్‌లు యూనిక్ కథనాలను కప్పివేసే ప్రపంచంలో, ఇండిపెండెంట్ ఫిలింస్ ద్వారా హృదయానికి హత్తుకునే కథలను చెప్పొచ్చని నేను నమ్ముతున్నాను. ఇండిపెండెంట్‌గా రూపొందిన 'C/o కంచరపాలెం' లాగానే, 'మర్మాణువు' కూడా మీ అందరితో కనెక్ట్ అయి మీకు మరపురాని అనుభూతిని వినోదాన్ని అందిస్తుంది. ఇది నా ప్రామిస్''


''మీ విలువైన మద్దతు కోసం 'C/o కంచరపాలెం' 5వ వార్షికోత్సవమైన సెప్టెంబర్ 7వ తేదీ నుండి పోర్టల్‌లు తెరవబడతాయి. ఈ అపురూపమైన సినిమాటిక్ ప్రయాణంలో భాగం కావడానికి, నాతో పాటు నడవడానికి మీకు ఆసక్తి ఉంటే.. దయచేసి మా www.marmaanuvu.com వెబ్‌సైట్‌ను సందర్శించండి . ఏదైనా కమ్యూనికేషన్ కోసం నాకు maha@marmaanuvu.com ఇమెయిల్ చేయండి'' అని వెంకటేష్ మహా తన నోట్ లో రాసుకొచ్చారు. 






నిజానికి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా 2021 మార్చి 25న 'మర్మాణువు' చిత్రాన్ని ప్రకటించారు వెంకటేష్ మహా. మిక్కీ జే మేయర్ దీనికి సంగీత దర్శకుడు. పెగాసస్ సినీ కార్పొరేషన్ ఎల్ఎల్‌పి & మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ శివాణి, శివాత్మిక‌, విజయ ప్రవీణ సంయుక్తంగా నిర్మించనున్నారని పోస్టర్ ద్వారా తెలిపారు. ఓ పుర్రె బొమ్మకు ఇంద్రజాలికుడు గెటప్ వేసినట్లు డిజైన్ చేయబడిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. రాజశేఖర్ క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఏం జరిగిందో ఏమో ఇన్నాళ్లకు ఈ మూవీ మేకింగ్ కోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లు దర్శకుడు తాజాగా ప్రకటించారు.


Also Read: 'బాయ్స్ హాస్టల్' ట్రైలర్: ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్ళు కూడా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial