Rajasekhar Voluntary Retirement :  ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో టాలీవుడ్ పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ ఇటీవలి కాలంలో మాత్రం చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆయన సినిమాలను గణనీయంగా తగ్గించేశారు. గత ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం మూడు చిత్రాలలో ('PSV గరుడ వేగ', 'కల్కి', 'శేఖర్') మాత్రమే కనిపించాడు. దురదృష్టవశాత్తు, వాటిలో ఒకటి మాత్రమే కమర్షియల్‌గా విజయం సాధించడంతో, రాజశేఖర్ సక్సెస్ రేటు కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో ఆయన చిత్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.


తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన అభిమానులు మాత్రం రాజశేఖర్ ఇంకా సినిమాల్లో కొనసాగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీ పడిన రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో మాత్రం ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ కూడా ప్రకటించలేదు. గతేడాది బాక్సాఫీస్ వద్ద శేఖర్ పరాజయం చెందినప్పట్నుంచి ఆయన ఏ ఒక్క సినిమాల్లోనూ కనిపించలేదు. క్యారెక్టర్ లేదా విలన్ పాత్రలు చేయడానికి అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ, రాజశేఖర్ వాటిలో వేటినీ అంగీకరించలేదని కూడా టాక్. ప్రత్యేకంగా ప్రధాన పాత్రలు పోషించాలనేది ఆయన కోరిక అని.. కానీ ఆ స్థాయిలో ఎలాంటి అవకాశం రాకపోవడంతో ఈ గ్యాప్ వచ్చినట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం వినిపిసోన్న ఊహాగానాలు నిజమనే అనిపిస్తున్నాయి. ఈ విషయం నిజమా, కాదా అని తెలియాలంటే రాజశేఖర్ గానీ, లేదంటే వారి కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు.


జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష 


12 ఏళ్ల కిందటి పరువు నష్టం దావా కేసులో జీవిత, రాజశేఖర్‌ దంపతులకు ఇటీవల ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. 2011లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ దంపతులపై పరువు నష్టం కేసు వేశాడు. చిరంజీవిపై వాళ్లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను ఈ కేసు వేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని చిరంజీవి అమ్ముకుంటున్నాడని జీవిత, రాజశేఖర్ అప్పట్లో ఆరోపించారు. వారి మాటలను సీరియస్ గా తీసుకున్న చిరంజీవి బావమరిది అల్లు అరవింద్.. పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. అలా ఈ కేసుపై 12ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఈ విషయంపై ఇటీవలే నాంపల్లి కోర్టు తమ తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి జీవిత, రాజశేఖర్ లు తమకు విధించిన జరిమానా చెల్లించారు. వెంటనే వాళ్లకు బెయిల్ కూడా లభించింది. 


Read Also : Bawaal Movie Review - 'బవాల్' రివ్యూ : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సినిమా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial