Sudheer Babu: నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రేపు శుక్రవారం (జూన్ 14) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దర్శక హీరోలతో తాజాగా ఓ ఫన్నీ చిట్ చాట్ ను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అందులో సుధీర్ బాబు చెప్పిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


'హరోం హర' సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి రిఫరెన్స్ ఉందని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ జ్ఞాన సాగర్ ద్వారక తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. తనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని, వాటిని టీమ్ అందరిపై రుద్దేస్తుంటానని తెలిపారు. ఆ సమయంలో ఏమనిపిస్తుంది అని అడగ్గా.. రియల్ లైఫ్ లోనూ దర్శకుడు ఏం చెప్పినా చెయ్యాలని అనిపిస్తుందని సుధీర్ బాబు అన్నారు. ''బ్లాక్ కలర్ కారుని మార్చేయండి అని ఒకసారి డైరెక్టర్ నాకు చెప్పారు. సినిమా, డైరెక్షన్ క్వాలిటీస్ వంటివి పక్కన పెడితే.. దేవుడు, పూజలు, న్యూమరాలజీ వంటి వాటి మీద దర్శకుడికి నాలెడ్జ్ ఉందని నేను భావించాను. నేను నమ్మినా నమ్మకపోయినా, ఎక్కడో అతను చెప్పేది నిజమే అని నేను అనుకున్నాను. అందుకే నా కార్ కలర్ మార్చమంటే మార్చేసాను. ఫ్రాంక్ గా చెప్పాలంటే బ్లాక్ వాడొద్దని చెప్పాడని.. నేను బ్లాక్ కలర్ అండర్ వేర్ కూడా వేసుకోవడం లేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ అసలు బ్లాక్ కలర్ ను దగ్గరకు రానివ్వడం లేదు'' అని సుధీర్ బాబు నవ్వుతూ చెప్పుకొచ్చారు. 


నిజానికి సుధీర్ బాబు చాన్నాళ్లుగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. 'సమ్మోహనం' తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. 'వీర భోగ వసంత రాయలు', 'వి', 'శ్రీదేవి సోడా సెంటర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి. హోమో సెక్సువ‌ల్ గా నటించిన 'హంట్'.. త్రిపాత్రిభినయం చేసిన 'మామా మశ్చీంద్ర' మూవీస్ కూడా సక్సెస్ అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'హరోం హర' చిత్రంపై ఘట్టమనేని అల్లుడు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకే దర్శకుడి సెంటిమెంట్ ను కూడా ఫాలో అవుతున్నారనిపిస్తోంది. బ్లాక్ కార్ ఉపయోగించవద్దని చెబితే, ఆ కలర్ అండర్‌వేర్‌ కూడా వేసుకోవడం లేదని చెబుతున్నారు. 


‘హరోం హర’ చిత్రాన్ని 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినట్లు టాక్. సినిమా చూసిన తర్వాత సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసుకుని బ‌య‌టికి వ‌స్తార‌ని, మిగతా ప్రేక్ష‌కులు త‌మ హీరోకు ఇలాంటి సినిమా ప‌డితే బాగుంటుంద‌ని అనుకుంటార‌ని సుధీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ‌హేష్ బాబు మూవీ అంటే ఫుల్ బాటిల్ కిక్కు ఇస్తుంద‌ని, తన సినిమా చిన్న చిన్న పెగ్గుల రూపంలో కిక్ ఇస్తుందని ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ ఈ సినిమా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రామిసింగ్‌ గా ఉంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. 


Also Read: 2025 సంక్రాంతి స్లాట్ కోసం పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్.. ఏయే సినిమాలు పోటీలో ఉన్నాయంటే?