Hari Hara Veera Mallu Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను బట్టి ఎక్కువగా తన సినిమాలు తెలుగులో విడుదల అవ్వడం వరకే పరిమితం అయ్యేవి. కానీ మొదటిసారి పవన్ కెరీర్‌లో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని ఓకే చేశారు. అదే ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంఖ్య పెరిగిపోయింది. గత కొన్నిరోజులుగా ‘హరిహర వీరమల్లు’ నుండి ఎలాంటి అప్డేట్ లేదు కానీ తాజాగా నిర్మాత ఏఎమ్ రత్నం ఇచ్చిన అప్డేట్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


చాలాకాలం తర్వాత..


పీరియాడిక్ డ్రామా చిత్రాలను తెరకెక్కించడం దిట్ట అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ మూవీ ప్రారంభమయ్యింది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్... ఏపీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు. దీంతో తను కమిట్ అయిన సినిమాలకు సమయం ఇవ్వలేకపోయారు. అలా అనుకున్న సమయానికంటే షూటింగ్ బాగా ఆలస్యమయ్యింది. దీంతో క్రిష్... దర్శకుడిగా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు అయిన జ్యోతికృష్ణ వచ్చాడు. ఇక ‘హరిహర వీరమల్లు’ నుండి ఒక అప్డేట్ వచ్చి చాలా కాలం అవ్వడంతో ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్న ఏఎమ్ రత్నం... తాజాగా మూవీపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు.


రిజల్ట్స్ తర్వాత...


‘హరి హర వీరమల్లు’ను రెండు పార్ట్స్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అదే విషయంపై ఏ ఎమ్ రత్నం స్పందించారు. ‘‘ముందు ఒక పార్ట్ విడుదల చేశాక రెండో పార్ట్ గురించి తర్వాత ఆలోచిస్తాం. 25 రోజులు షూటింగ్ చేస్తే మొదటి పార్ట్ అయిపోతుంది. మేము సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మొదలుపెట్టి పూర్తి చేసేస్తాం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి సెప్టెంబర్, అక్టోబర్ టైమ్‌లో రిలీజ్ చేసేస్తాం’’ అని క్లారిటీ ఇచ్చారు ఏఎమ్ రత్నం. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించిన ఈ అప్డేట్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.



‘ఓజీ’ కూడా అప్పుడే..


‘హరిహర వీరమల్లు’తో పాటు సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. షూటింగ్ పూర్తవుతుందనే నమ్మకంతో ‘ఓజీ’ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ కూడా దాదాపు అదే సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏఎమ్ రత్నం తెలిపారు. ఇక ఈ మూవీలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహీ, సుబ్బరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు.. ‘హరిహర వీరమల్లు’ను నిర్మిస్తున్నారు.


Also Read: ‘విశ్వంభర’ సెట్స్‌లో చిరంజీవికి సర్‌ప్రైజ్... మెగాస్టార్‌ను కలిసిన అజిత్