ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందిన చారిత్రక చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా సినిమా తీశారని వచ్చిన వార్తల్లో నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. వాస్తవ సంఘటనలు, వ్యక్తుల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించలేదని పేర్కొంది. సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడిన ఓ వీరుడి ప్రయాణం తెలిపేలా కల్పిత కథతో వీరమల్లు రూపొందించామని వివరించింది.
శివుడు, విష్ణువుల అవతారంగా వీరమల్లు!
'హరిహర వీరమల్లు' దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ చేపట్టిన తర్వాత కథ స్వరూపం పూర్తిగా మారిపోయిందని చిత్ర బృందం వివరించింది. అంతకు ముందు ఉన్న కథలో స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ... సరికొత్త గాథగా వీరమల్లును మలిచారట.
పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు - మోహినిల కుమారుడిగా... శైవం - వైష్ణవం మధ్య వారధిగా వర్ణిస్తారని... ఆ విధంగా 'హరి హర వీరమల్లు'లోని కథానాయకుడి పాత్రను శివుడు - విష్ణువుల అవతారంగా చూడబోతున్నామనేది చిత్ర బృందం చెప్పిన మాట. సినిమా టైటిల్ సరిగ్గా గమనిస్తే... హరి (విష్ణు), హర(శివుడు) - ఆ రెండు పదాలు చిత్ర సారాంశాన్ని తెలియజేస్థాయి.
సినిమా ట్రైలర్ గమనిస్తే... శివుడు, విష్ణువుల అవతారం వీరమల్లు అని తెలిపేలా పలు అంశాలు ఉంటాయి. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగ మనకు కనిపిస్తుంది. శివుడిని సూచించే డమరుకాన్ని వీరమల్లు చేతిలో చూడవచ్చు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ కోసం శివ వైష్ణవ రూపాల్లో వీరమల్లు కనిపిస్తాడట.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా!
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ 'హరిహర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీస్థాయిలో నిర్మించారు. గతంలో ఇటువంటి సినిమాలు నిర్మించిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ 'హరి హర వీరమల్లు' కూడా ఘన విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నారు. అందుకని, ఓవర్సీస్ - హిందీ తప్ప మిగతా రైట్స్ అమ్మడానికి రెడీగా లేరు.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం, సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కడంతో 'హరి హర వీరమల్లు'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. దాంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ నెలకొంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా విడుదల కానుంది.
Hari Hara Veera Mallu Cast And Crew: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకత్వం: జ్యోతి కృష్ణ - క్రిష్ జాగర్లమూడి, నిర్మాత: ఎ. దయాకర్ రావు, సమర్పణ: ఏఎం రత్నం, సంగీతం: ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి.