Hari Hara Veera Mallu Movie Director Controversy: 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదల తర్వాత అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో నెలకొన్న కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది దర్శకుడు క్రిష్ ఈ సినిమా చేస్తున్నారా? లేదా? అనే విషయంలో!


క్రిష్ జాగర్లమూడితో పాటు జ్యోతి కృష్ణ కూడా!
'హరి హర వీరమల్లు' మూడున్నరేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లింది. రాజకీయాల్లోకి వెళ్లాను కనుక సినిమాలు చేయనని చెప్పిన జనసేనాని... హీరోగా మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాక, పార్టీ నడపటానికి అవసరమైన డబ్బుల కోసం సినిమాలు చేయక తప్పదని చెప్పిన తర్వాత మొదలైన తొలి సినిమా 'హరి హర వీరమల్లు'. దీని తర్వాతే 'వకీల్ సాబ్' గానీ, 'భీమ్లా నాయక్' గానీ, 'బ్రో' గానీ సెట్స్ మీదకు వెళ్లాయి. థియేటర్లలోకి వచ్చాయి. కానీ, 'హరి హర వీరమల్లు' షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 


'హరి హర వీరమల్లు' చిత్రీకరణకు బ్రేకులు పడ్డప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ మధ్య గొడవలు వచ్చాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి. టీజర్ విడుదల పోస్టర్ మీద ఆయన క్రిష్ పేరు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు టీజర్ విడుదల అయ్యాక అవి నిజమని నిర్ధారణ అయ్యింది. ఈ చిత్రానికి క్రిష్ ఒక్కరే దర్శకుడు కాదు... ఆయనతో పాటు చిత్ర సమర్పకులు ఏయం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ కూడా దర్శకత్వం వహిస్తారు. నిజం చెప్పాలంటే... క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మిగతా సినిమాను పూర్తి చేయడానికి జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు.


పవన్ స్థాయిని జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేయగలరా?
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే ఆషామాషీ కాదు. ఆయన ఫ్యాన్స్ అంచనాలు అందుకోవాలి. వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది కనుక వ్యాపార పరంగానూ ఆలోచించాలి. అయితే... ఇక్కడ పవన్ స్థాయిని జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేయగలరా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 


ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం విడుదలైన 'నీ మనసు నాకు తెలుసు'తో జ్యోతి కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హీరోయిన్ త్రిషకు తెలుగులో మొదటి సినిమా అదే. చాలా సంవత్సరాల విరామం తర్వాత  కిరణ్ అబ్బవరం హీరోగా ఇటీవల విడుదలైన 'రూల్స్ రంజన్'కు డైరెక్షన్ చేశారు. ఆ రెండూ డిజాస్టర్ సినిమాలే. ఆయన తండ్రి ఏయం రత్నం 'హరి హర వీరమల్లు'కు ప్రజెంటర్ కావడం... క్రిష్ వాకవుట్ చెయ్యడంతో జ్యోతి కృష్ణకు మిగతా సినిమా కంప్లీట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ లేదంటే ఆయనకు పవన్ స్థాయిని హ్యాండిల్ చేసే అవకాశం వచ్చేది కాదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆఫ్ ది రికార్డ్ టాక్. అయితే... సినిమా కథ, ఇప్పటి వరకు పూర్తైన సన్నివేశాల దర్శకత్వం విషయంలో క్రిష్ ప్రమేయం విడదీయలేనిది కాబట్టి  ఆయన పేరును కూడా దర్శకుడిగా వేశారు.


కంగనాతోనూ ఇంచు మించు ఇటువంటి గొడవలో క్రిష్! 
దర్శకుడిగా క్రిష్ ఓ సినిమా నుంచి తప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కంగనా రనౌత్ 'మణికర్ణిక' విషయంలో కూడా జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి కథతో కంగనా టైటిల్ పాత్రలో క్రిష్ ఆ సినిమా మొదలు పెట్టారు. దాదాపు 70 శాతం పూర్తి అయిన తర్వాత కంగనాకు, ఆయనకు మధ్య సినిమా విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడు 'మణికర్ణిక' టైటిళ్లలో ఎక్కడా క్రిష్ పేరు కనిపించలేదు. తనకు జరిగిన అన్యాయం మీద ఆయన న్యాయపోరాటం కూడా చేశారు.


ఇప్పుడు 'హరి హర వీరమల్లు' విషయంలోనూ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సగం సినిమా పూర్తి అయ్యాక క్రిష్ తప్పుకున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే... టీజర్‌లో ఆయన పేరు ఉంది. కాకపోతే... అప్పుడు కంగనాతో గొడవ, ఇప్పుడు జనసేనానితో అని ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ వినబడుతున్నాయి.


Also Read'కూలీ'పై ఇళయరాజా గరమ్ గరమ్ - లీగల్ చిక్కుల్లో రజనీకాంత్ సినిమా



అనుష్క సినిమా పనుల్లో క్రిష్ బిజీ బిజీ!
'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్ నుంచి క్రిష్ కొన్ని రోజుల క్రితమే వాకవుట్ చేసి కొత్త సినిమా పనులు మొదలు పెట్టారని టాలీవుడ్ ఖబర్. అనుష్క ప్రధాన తారగా ఆయన 'ఘాటీ' సినిమా చేస్తున్నారు. ఇంతకు ముందు వాళ్లిద్దరి కలయికలో 'వేదం' సినిమా వచ్చింది. 


'మణికర్ణిక' సినిమా కోసం మూడేళ్ల సమయాన్ని వృధా చేసుకున్న క్రిష్... ఆ తర్వాత తేజ దర్శకత్వంలో మొదలైన ఎన్టీఆర్ బయోపిక్ టేకప్ చేశారు. కథానాయకుడు, మహానాయకుడు... రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ కోసం నాలుగేళ్లు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' కోసం సుమారు మరో నాలుగేళ్లు తన టైమ్ కేటాయించారు. మధ్యలో 'కొండపోలం' తీసినా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ పరంగా అది ఫ్లాప్. 'గమ్యం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె' లాంటి గొప్ప సినిమాలు తీసిన క్రిష్ గడిచిన పదేళ్ల కాలంలో ఒక్క విజయం కూడా అందుకోలేదు. దీనికి తోడు ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఆయన పేరు వినిపించింది. అదీ ఆయన కెరీర్ మీద ఒక మచ్చ.


Also Readకల్కి నిర్మాతలతో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?