HanuMan: ఈరోజుల్లో సినిమాలు చాలా అరుదుగా ఎక్కువరోజులు హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతున్నాయి. ఇక 2024 సంక్రాంతికి విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ మాత్రమే ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అంతే కాకుండా పాజిటివ్ మౌత్ టాక్‌తో ఇప్పటికీ రన్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. 2024లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్‌ను సృష్టించిన మొదటి సినిమాగా ‘హనుమాన్’ నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ రికార్డుల ఖాతాలో మరొకటి వచ్చి చేరింది.


అరుదైన రికార్డ్..


‘హనుమాన్’ కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్‌లో తేజ సజ్జాకు ముందుగా పెద్ద మార్కెట్ ఏమీ లేదు. అయినా కేవలం కంటెంట్‌ను నమ్ముకోవడంతో అక్కడ కూడా తన సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ‘హనుమాన్’ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. కలెక్షన్స్ విషయంలో రికార్డ్‌పై రికార్డ్ నమోదు చేసుకుంటూ వెళుతున్న ‘హనుమాన్’.. ఇప్పుడు సినిమాను చూడడానికి వస్తున్న ప్రేక్షకుల విషయంలో కూడా రికార్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 


మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్..


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమాకు కోటి టికెట్లు అమ్ముడిపోయాయని సమాచారం. దీంతో 2024లో విడుదలయిన అన్ని సినిమాల్లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఒక కోటి టికెట్లు అమ్ముడుపోయిన విషయాన్ని మూవీ టీమ్ స్వయంగా ప్రకటించింది. సినిమాను సమర్పించిన సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్.. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. ‘దేశం మొత్తం హనుమాన్‌ను మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోటికిపైగా ప్రేక్షకులు వచ్చారు.. ఇంకా వస్తున్నారు’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంతోషంగా పోస్ట్‌ను షేర్ చేసింది. 






హిందీలో బ్లాక్‌బస్టర్..


ఇక దేవుడి కథలు, అలాంటి జోనర్‌లో తెరకెక్కిన సినిమాలంటే నార్త్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. దీనికి నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమానే ఉదాహరణ. ఇప్పుడు అదే తరహాలో, దానికి మించి సక్సెస్ అయ్యింది ‘హనుమాన్’. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు దీనిని మళ్లీ మళ్లీ చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ హిందీ వర్షన్‌కు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ లభించాయి. ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంకా కొన్నిరోజులు ఇలాగే కొనసాగితే.. ‘హనుమాన్’కు హిందీలోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో తనకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ అలరించింది.


Also Read: బాలీవుడ్‌ నటుల రెమ్యునరేషన్‌పై నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సంచలన కామెంట్స్‌, బేరాలు ఆడితే..