Hanu Man Team in USA: 'హనుమాన్' భారీగా దూసుకుపోతోంది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇండియాలోనే కాదు ఓవర్‌సీస్‌లో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇక ఇప్పుడు ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమా టీమ్. ఇంతటి ఆదరణ కలిగించిన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇండియాలో సక్సెస్ మీట్ నిర్వహించిన మేకర్స్.. ఇప్పుడిక యూఎస్‌లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీంతో తన జీవితంలో మొదటిసారి యూఎస్ వెళ్లానని పోస్ట్ పెట్టారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
మూడురోజులు.. మూడు ప్రదేశాల్లో
తమ సినిమాకి అంత పెద్ద సక్సెస్ కట్టబెట్టిన ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు సినిమా టీమ్ రెడీ అవుతోంది. దాంట్లో భాగంగా అమెరికాలో మూడు రోజుల పాటు థ్యాంక్స్, మీట్ అండ్ గ్రీట్ పార్టీలను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 2న వర్జీనియాలో, 3న డల్లాస్‌లో, 4న బేఏరియాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సినిమా హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ, హీరోయిన్ అమ్రిత, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యూఎస్ చేరుకున్నారు. ఈ సందర్బంగా ప్రశాంత్‌వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 'మొదటిసారి యూఎస్‌లో అడుగుపెట్టాను' అంటూ ఆయన పెట్టిన పోస్ట్‌పై అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. 'నువ్వు సాధించావు అన్న, అది కదా అన్న సక్సెస్ అంటే' అంటూ రీపోస్ట్‌లు చేస్తున్నారు. 'ఇప్పుడు అలానే అంటారు.. తర్వాత మార్వెల్‌కి పోటీగా ఒక సినిమా చేసేస్తారు' అంటూ ప్రశాంత్ మీద ఉన్న నమ్మకాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫాలోవర్స్.
'హను మాన్' సినిమా అనూహ్య రీతిలో జనాల్లోకి వెళ్లిపోయింది. చాలా తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ సినిమాని తెరకెక్కించారు ప్రశాంత్‌వర్మ. దీంతో ప్రశాంత్ వర్మకి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఆయన ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో సమానం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. విడుదలై దాదాపు మూడు వారాలు దాటినప్పటికీ జనాలు థియేటర్లకు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు దాటిపోయాయి కలెక్షన్స్. ఇండియాలోనే కాకుండా.. ఓవర్‌సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది 'హనుమాన్'. కొన్ని యాస్‌పెక్ట్స్‌లో అయితే.. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టింది ఈ సినిమా. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అన్నింటికంటే ఓవర్‌సీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది 'హనుమాన్'.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పార్ట్ - 2 కూడా రిలీజ్ కాబోతోంది. 2025లో 'జై హనుమాన్'ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్‌వర్మ. 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైపోయిందని, దాంట్లో హనుమాన్ హీరో అని చెప్పారు. ఆ క్యారెక్టర్ కోసం ఎవరైతే బాగుంటుందో కసరత్తు చేస్తున్నామన్నారు. చిరంజీవిని ఆ క్యారెక్టర్ కోసం అడుగనున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రశాంత్‌వర్మ.
Also Read: ప్రధాని మోడీ చెప్పారని.. పెళ్లి వేదికను మార్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్