''చదలవాడ శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఆర్థిక మద్దతు ఇస్తారు. ఫిలిం చాంబర్ ఎన్నికల్లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. నేను ఆ పదవి నుంచి వెళ్లే లోపు మంచి ఫలితాలు చూపించే ప్రయత్నం చేస్తా. శ్రీనివాస్ గారి అబ్బాయి లక్ష్ నటించిన 'ధీర' ట్రైలర్ బాగుంది. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. లక్ష్ కష్టానికి, 'ధీర' టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని అగ్ర నిర్మాత 'దిల్' రాజు అన్నారు. 


లక్ష్ చదలవాడ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ధీర'. 'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు' తర్వాత ఆయన నటించిన చిత్రమిది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈ చిత్రాన్ని నైజాం, విశాఖలో 'దిల్' రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. 'ధీర' ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ లాంచ్ చేశారు.


చదలవాడ బ్రదర్స్ ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు
'దిల్' రాజు మాట్లాడుతూ... ''నేను 25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ను చూస్తున్నా. అనురాధ ప్రొడక్షన్స్‌ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. నేను అప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించా. అప్పట్లో పెద్దగా పరిచయం లేదు. 'దసరా' కొన్నారని తెలిసి కలిశా. ఆ తర్వాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం'' అని చెప్పారు. 


తండ్రిగా గర్విస్తున్నా... లక్ష్ గురించి చదలవాడ శ్రీనివాసరావు!
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''నేను ఎంతో మంది దర్శకులను పరిచయం చేశా. 'ధీర'తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నా. అతని కష్టాన్ని చూశా. అందుకు తగ్గ ప్రతిఫలం రావాలి. ఇందులో మా అబ్బాయి లక్ష్ హీరోగా నటించాడు. తండ్రిగా అతడిని చూసి గర్విస్తుంటా. ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు. శుక్రవారం ధీర విడుదల అవుతోంది. మార్చిలో వంద కోట్లతో తీసిన 'రికార్డ్ బ్రేక్' అనే గ్రాఫిక్స్ సినిమా రాబోతోంది. ఐదేళ్ల నుంచి ఆ సినిమా తీస్తున్నా. అది పాన్ వరల్డ్ సినిమా. సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో ఓ హిందీ సినిమా, కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో 'నా కనురెప్పవు నువ్వేరా' సినిమాలు రెడీ అవుతున్నాయి. మా సంస్థలో 16 సినిమాలు చేస్తున్నాం. 'దిల్' రాజు గారిని ఛాంబర్ అధ్యక్షుడు చేయడంలో నా వంతు సాయం చేశా. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒక త్రాటి పైకి తీసుకు రావాలని అనుకుంటున్నా. దిల్ రాజు గారు ఆ పని చేశారు. మున్ముందు చిత్రసీమ మరింత ఉన్నత స్థాయికి వెళుతుంది'' అని అన్నారు.


Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - కంటతడి పెట్టించడమూ వచ్చు!


లక్ష్ చదలవాడ మాట్లాడుతూ... ''సినిమాలో నా పాత్రకు, నిజ జీవితంలో నాకు ఏ మాత్రం సంబంధం ఉండదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే క్యారెక్టర్ చేశా. అటువంటి వాడికి ఓ మిషన్ ఇస్తే... ఆ ప్రయాణంలో ఏయే సమస్యలు వచ్చాయి? అనేది 'ధీర' సినిమా. నాన్న గారు లేకపోతే నేను లేను. ఆయన వన్ మెన్ ఆర్మీ. జయాపజయాలు ఎన్నో చూశారు. ఆయనతో మాట్లాడాలంటే ఇప్పటికీ నాకు భయమే. థాంక్స్ డాడీ... మీ వల్లే మేం ఉన్నాం. మా నిర్మాణ సంస్థలో కొత్తవాళ్లను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాం'' అని అన్నారు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న మిగతా సినిమాలు కూడా సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.


Also Readస్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?


ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన, వైవిఎస్ చౌదరి, నిర్మాత విజయ రామరాజు, 'మాతృదేవోభవ' దర్శకుడు అజయ్ కుమార్, 'సిల్లీ మాంక్స్' అనిల్, 'కర్త కర్మ క్రియ' దర్శకుడు నాగు గౌర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.