Maruti Suzuki EVX with ADAS: ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలలో ఏడీఏఎస్ ఒకటి. చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడీఏఎస్‌ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు. అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి ఇంకా తన కార్లలో ఏడీఏఎస్‌ని అందించలేదు. కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి ఈవీఎక్స్‌లో ఏడీఏఎస్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


మారుతి సుజుకి ఈవీఎక్స్‌... కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. మారుతి ఈ కారు కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో, తరువాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది. ఇప్పుడు ఇటీవలి స్పై షాట్‌లో ఏడీఏఎస్ మాడ్యూల్ కూడా ఇందులో కనిపించింది. దీన్ని బట్టి ఈవీఎక్స్‌లో ఏడీఏఎస్ ఉంటుందని చెప్పవచ్చు. ఏడీఏఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ మ్యూల్ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్. ఇది ప్రోటోటైప్ లాగా కనిపించడం లేదు.


ఏడీఏఎస్ కాకుండా మారుతి ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఇందులో ముందు, వెనుక రెండింటిలోనూ దాని మస్కులర్ ఫెండర్‌లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌లు కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి. ఓఆర్వీఎంల ప్లేస్‌మెంట్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా సెటప్‌తో కూడిన కెమెరాలు కనిపించాయి.


ఈవీఎక్స్ మనదేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఇది పెద్ద 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది రియల్ లైఫ్‌లో రోడ్ల మీద 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ని అందిస్తుంది. రెండవ బ్యాటరీ ప్యాక్ 48 కేడబ్ల్యూహెచ్. దీని రేంజ్ 350 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. సింగిల్, డ్యూయల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడవచ్చు.


మారుతి సుజుకి ఈవీఎక్స్ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ సంవత్సరం ఈ ఎస్‌యూవీని పరిచయం చేసి 2025 ప్రారంభంలో ధరలను ప్రకటించవచ్చు. మారుతి EVX ధర రూ. 21 లక్షల నుంచి రూ. 27 లక్షల మధ్య ఉంటుందని అంచనా.


మరోవైపు మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్‌తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైమ్‌లో కనిపించింది. ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా కనిపించడం విశేషం. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను రివీల్ చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిల్వర్ కనెక్ట్ బార్, సి-పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్‌తో ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్‌లతో రానుంది. దీని పైకప్పు ఈ కారుకు కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం. 


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!