Nara Lokesh on DSC Notification: ఎన్నికలకు రెండునెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ముఖ్యమంత్రి జగన్ సరికొత్త జగన్నాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని అన్నారు. అబద్దాలు, మోసం, వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్.. ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయి, మెగా డీఎస్సీ ఇస్తా అన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్న విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. 


గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని.. ఇప్పుడు చివరకు ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లే ముందు 6 వేల పోస్టులు భర్తీ చేస్తానంటున్నాడని లోకేశ్ అన్నారు. ‘‘2021 - 22 నాటికి ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. 12,386 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఖాళీలు ఉన్నాయి కానీ 8,366 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి బొత్స అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇప్పుడు అందులో కూడా 2,366 పోస్టులు కోతపెట్టి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటున్నారు. 


మూడు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ - పరీక్ష ఇంకెప్పుడు?


ముఖ్యమంత్రి జగన్, విద్యామంత్రి బొత్స మాత్రం పూటకోమాట చెబుతూ చివరకు నిరుద్యోగులను నిండా ముంచేశారు. 2014-19 మధ్యలో రెండు మెగా డీఎస్సీలు ప్రకటించి 16,790 మంది నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఎన్నికల  కోసమే  జగన్ ఇప్పుడు నోటిఫికేషన్‌ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 వారాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న తరుణంలో జగన్ చేస్తున్న హడావిడి వెనుక అంతర్యమేమిటో  తెలుసుకోలేని అమాయకులా విద్యావంతులైన నిరుద్యోగులు? 


ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే  పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు? పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎన్నికలు సమయానికి ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమయ్యే పనేనా? ఎంతకాలం ఈ మోసపు వాగ్దానాలు? ఇలా ఎన్నిరోజులు నిరుద్యోగులను ఇలా వంచనకు గురిచేస్తారు? చిత్తశుద్ధి లేని ఇలాంటి జిమ్మిక్కులు ఆపి జర సర్దుకోండి.. జగన్’’ అని నారా లోకేశ్ స్పందించారు.