ఇండస్ట్రీలో ఇప్పటికీ కొందరు సీనియర్ నటీమణులు రాణిస్తున్నారు. యంగ్ హీరోయిన్లతో పోటీపడుతూ.. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటున్నారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి వారిలో హన్సిక ఒకరు. ఇతర భాషల్లో హన్సిక.. ఏడాదికి ఒక మూవీ అయినా విడుదల చేస్తుందేమో కానీ తెలుగులో మాత్రం తను కనీసం మూడేళ్లకు ఒకసారి కనిపిస్తోంది. ఇక తను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు హన్సిక. తాజాగా తన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అప్పటికి, ఇప్పటికి ఉన్న తేడాలతో పాటు ఈతరం హీరోయిన్ల గురించి కూడా తన అభిప్రాయాలను బయటపెట్టింది.
శ్రీలీల అంటే ఇష్టం
తెలుగులో ప్రస్తుతం బాగా నటిస్తున్న హీరోయిన్లు ఎవరు అని అడగగా.. వెంటనే శ్రీలీల పేరు చెప్పింది హన్సిక. ‘‘తను చాలా అందంగా ఉంటుంది. మంచి నటి. నాకు తన వర్క్ ఇష్టం’’ అని బయటపెట్టింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరోయిన్లను చూస్తుంటే తను ఎలా ఫీలవుతుంది అని అడగగా.. ‘‘నేను వాళ్లని యంగ్, సీనియర్ అన్నట్టుగా చూడను. నాకు నేను ఓల్డ్ అని ఎప్పుడూ అనుకోను’’ అని తెలిపింది. వయసు గురించి కాకపోయినా అనుభవం విషయంలో అయినా రోజులు మారాయని, ఎవరి అనుభవం వారికి ఉంటుందని చెప్పుకొచ్చింది.
అప్పటికీ, ఇప్పటికీ చాలా మారింది
‘‘నేను ఎనిమిదేళ్లు ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. ఆ తర్వాత 15 ఏళ్లకే హీరోయిన్‌గా మారాను. కానీ అప్పుడు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కు, ఇప్పుడు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కు చాలా తేడా ఉంది. ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరి ప్రయాణం వారిది. మన అనుభవాలే మనకు పాఠాలు అవుతాయి. కానీ ఈరోజుల్లో నటించడానికి వస్తున్నవారు పూర్తిగా రెడీగా వస్తున్నారు. వారు అన్నింటికి రెడీగా ఉంటున్నారు. నేర్చుకోవడంలో కూడా చురుగ్గా ఉంటున్నారు. అప్పట్లో అలా లేదు. అప్పట్లో కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. కాబట్టి అన్నింటిలో లాభాలు, నష్టాలు ఉన్నాయి’’ అని హన్సిక తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
స్కిన్ మాఫియా గురించి తెలుసుకున్నాను
‘‘గ్లామర్ రోల్ అయితే నేను కష్టపడడం లేదని కాదు, నేను యాక్ట్ చేయడం లేదని కాదు. విలేజ్ రోల్ అయితే నేను కష్టపడడం లేదని కాదు. నాకు అయితే స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం’’ అని చెప్పింది హన్సిక. ఇక ‘మై నేమ్ ఈజ్ శృతి’ కోసం ఏ విధంగా కష్టపడ్డారని ప్రశ్నించగా.. ‘‘నేను ఈ పాత్ర గురించి చాలా చదివాను. అంటే పాత్ర గురించి కాదు. స్కిన్ మాఫియా గురించి చాలా తెలుసుకున్నాను. ఇలాంటిది ఒకటి జరుగుతుందని కూడా నాకు తెలియదు. చాలామందిని అడిగాను. దాని గురించి చదివాను. తెలుసుకున్న తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నాను. సెట్స్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నేను సినిమా కోసం పూర్తిగా సిద్ధపడతాను’’ అని హన్సిక.. తన సినిమా గురించి చెప్పుకొచ్చింది.
ఆరోగ్యం బాలేకపోయినా..
‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం కోసం హన్సిక తెలుగు ప్రేక్షకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతోంది. ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక ఈ ప్రమోషన్స్‌లో తను పాల్గొనడంపై కూడా హన్సిక స్పందించింది. ‘‘నేనెప్పుడూ ప్రమోషన్స్‌లో ముందుంటాను. నా తమిళ సినిమాల విషయంలో కూడా ఇంతే. నేను ఆ ఎఫర్ట్ తీసుకుంటాను. ప్రస్తుతం నాకు చాలా జ్వరం ఉంది. నేను జనాల్లోకి వెళ్లాలి. రిలీజ్‌కు కొంత సమయమే ఉంది. నేను ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం’’ అని తెలిపింది.
Also Read: తమన్నా సినిమాకు నెగిటివ్ రివ్యూలు - కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు