తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ కథానాయకులలో సత్యదేవ్ (Satyadev Kancharana) ఒకరు. ఆయన హీరోగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam Movie). అందులో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కథానాయికగా నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెప్టెంబర్ 23న... గుర్తు పెట్టుకోండి!
సెప్టెంబర్ 23న 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam Latest Release Date) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నేడు చిత్ర బృందం వెల్లడించింది. ఈపాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా కారణంగా తొలుత వాయిదా పడింది. ఆ తర్వాత థియేటర్ల దగ్గరకు భారీ కమర్షియల్ సినిమాలు క్యూ కట్టడంతో వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడు మంచి తేదీ చూసుకుని విడుదల చేస్తున్నారు.
జీవితాంతం గుర్తుకు వచ్చే సంఘటనలతో...
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రానికి నాగ శేఖర్ దర్శకులు. ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావన రవి, రామారావు చింతపల్లితో కలిసి ఆయన సినిమాను నిర్మించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది.
''ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో రూపొందించిన చిత్రమిది'' అని 'గుర్తుందా శీతాకాలం' యూనిట్ పేర్కొంది.
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ
'గుర్తుందా శీతాకాలం' సినిమాలో మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇందులో ప్రియదర్శి వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సినిమాలో సాంగ్స్ హైలైట్ అవుతాయని, ఆ పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటుందని నిర్మాతలు తెలిపారు.
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా కూడా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా పేరు 'ప్లాన్ ఏ ప్లాన్ బి' (Plan A Plan B). హిందీ చిత్రమది. అందులో రితేష్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh) హీరోగా నటించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 30న ఆ సినిమా విడుదల కానున్నట్లు తమన్నా తెలిపారు. విడాకులు ఇప్పించే న్యాయవాదిగా రితేష్ నటిస్తుంటే... పెళ్లిలు కుదిర్చే అమ్మాయిగా తమన్నా నటించారు. వాళ్ళిద్దరికీ ఎలా ముడి పడిందనేది కథ.