GST Officers Raid On Manchu Vishnu Office: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ రిలీజ్‌కు ముందే బిగ్ షాక్ తగిలింది. విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్‌కు రెండు రోజుల ముందు సోదాలు చేసి కీలక సమాచారం సేకరించారు. లెక్క ప్రకారం జీఎస్టీ కట్టారా? లేదా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

మంచు విష్ణు రియాక్షన్

తాజాగా దీనిపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. జీఎస్టీ అధికారుల సోదాలపై మీడియా ప్రశ్నకు.. మీరు చెప్పే వరకూ తనకు తెలియదంటూ చెప్పారు. 'జీఎస్టీ అధికారుల సోదాలని మీరు చెప్పే వరకూ నాకు తెలియదు. అయినా ఇందులో దాచి పెట్టేదేమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది.' అని అన్నారు.

Also Read: కాటన్ దొర పొగిడిన డొక్కా సీతమ్మ జీవితంపై సినిమా... మురళీ మోహన్ బర్త్‌డే స్పెషల్ ఏమిటంటే?

దేవుడు భక్తుడు మధ్య జరిగే స్టోరీ

ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా.. హిందీలో ఫైనల్ కాపీనీ చూసినట్లు మంచు విష్ణు తెలిపారు. 'కొందరు ప్రముఖులు మూవీని చూసి ప్రశంసలు కురిపించారు. సినిమా క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు. ఆడియన్స్ కూడా అదే చెబుతారని ఆశిస్తున్నా. 'కన్నప్ప' మూవీ దేవుడు, భక్తుడికి మధ్య జరిగే కథ. మహా భక్తుడు 'కన్నప్ప' గురించి ఇప్పటి తరానికి తెలియాలన్న ఉద్దేశంతో ఈ మూవీని తెరకెక్కించాం.' అని చెప్పారు.

మూవీ బడ్జెట్ ఎంత?

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో 'కన్నప్ప' మూవీని తెరకెక్కించగా.. ఈ మూవీ బడ్జెట్ ఎంతనే దానిపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదు మంచు విష్ణు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న ఎదురైనా అనుకున్న దాని కంటే ఎక్కువగానే బడ్జెట్ అయ్యిందని తెలిపారు. అంతే తప్ప ఇంత బడ్జెట్ కచ్చితంగా అయ్యిందని చెప్పలేదు. తాజాగా.. జీఎస్టీ అధికారుల సోదాలతో మరోసారి ఈ మూవీ బడ్జెట్ ఎంతనే దానిపై చర్చ సాగుతోంది.

ఈ మూవీని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు. 'మహా భారతం' సీరియల్ ఫేం ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. తిన్నడిగా మంచు విష్ణు నటించారు. ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, రుద్రుడిగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'కన్నప్ప'.

ట్రోలర్స్‌కు టీం వార్నింగ్

ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొన్నింటిపై అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా సాగింది. దీనిపై గతంలో పలు ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు స్పందించారు. తాజాగా.. రిలీజ్ టైంలోనూ టీం ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. సినీ విమర్శకులు మూవీని చూసి తమ అభిప్రాయాలు చెప్పాలంటూ సూచించింది.