Actor Sriram Alias Srikanth Sensational Confession In Drugs Case: హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. శ్రీరామ్‌ను కోర్టులో హాజరు పరచగా తాను చేసిన తప్పును ఒప్పుకొన్నారు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కోర్టుకు వివరించారు.

రెమ్యునరేషన్ బదులుగా డ్రగ్స్

AIADMK మాజీ లీడర్ ప్రసాద్ తనకు డ్రగ్స్ అలవాటు చేశారని హీరో శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. 'ప్రసాద్ నిర్మాణంలో 'తీంగిరై' అనే సినిమాలో నటించాను. అప్పట్లో రెమ్యునరేషన్ రూ.10 లక్షలు ఇవ్వాలి. డబ్బు అడిగిన ప్రతీసారి నాకు కొకైన్ ఇచ్చేవాడు. అలా నాకు అది అలవాటు అయిపోయింది. ప్రసాద్ అరెస్ట్ కావడానికి ముందు కూడా నాకు 250 గ్రాముల కొకైన్ ఇచ్చాడు. గత శనివారం రాత్రి నుంగంబాక్కంలోని అతని ఇంట్లో కొకైన్ పార్టీని నిర్వహించడానికి దాన్ని వాడాను. నేను డ్రగ్స్ అమ్మలేదు. కేవలం తీసుకున్నాను.' అంటూ శ్రీరామ్ చెప్పారు.

బెయిల్ రిజెక్టెడ్

డ్రగ్స్ తీసుకోవడం తప్పని తనకు తెలుసని.. తప్పు చేశానని శ్రీరామ్ కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని.. తనను చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. నార్కోటిక్స్ కేసులు విచారించే స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి శ్రీరామ్‌కు సూచించారు. జులై 7 వరకూ రిమాండ్ విధించగా.. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన  వారిని పట్టుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

Also Read: పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు

మరో నటుడి కోసం గాలింపు

ఈ కేసుకు సంబంధించి మరో కోలీవుడ్ స్టార్ కృష్ణ కూడా డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందగా పోలీసులు ఆయన్ను విచారించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన కేరళలో షూటింగ్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అయితే.. కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే.. టాలీవుడ్ యాక్టర్స్‌తోనూ ఆయనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే?

AIADMK మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు సమాచారం బయటకు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే హీరో శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి విచారించారు. ఆయన్ను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

కోలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఆడియన్స్‌కు దగ్గరయ్యారు శ్రీరామ్. 'రోజా కూటం' తమిళ్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. 'ఒకరికి ఒకరు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, సుప్రీమ్, సీత, శ్రీనివాస కల్యాణం, రాగల 24 గంటల్లో, అసలేం జరిగింది, రావణాసుర, పిండం, వలరి సినిమాల్లో నటించారు.