Naatu Naatu lyricist Chandrabose: 10 శాతం సాంగ్‌కు 19 నెలలు టైమ్ పట్టింది : ABP దేశంతో చంద్రబోస్

Golden Globe Award 'Naatu Naatu' Song From RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది మన అచ్చ తెలుగు నాటుపాట.

Continues below advertisement

Golden Globe Award 'Naatu Naatu' Song From RRR: నాటు నాటు సాంగ్ తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సినీ రంగంలో ప్రముఖ పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది మన అచ్చ తెలుగు నాటుపాట. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని ఈ పాట చేసిన సందడి అంతా ఇంతాకాదు. తాజాగా మరోసారి ప్రపంచపటంపై తెలుగు వెలుగులు విరజిమ్మింది. నాటు నాటు సాంగ్ రచయిత చంద్రబోస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ తో పాటు ఇతర సినీ రంగాల సెలబ్రిటీలు, టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా ఒకరేమిటి చంద్రబోస్ పదకూర్పుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గేయ రచయిత చంద్రబోస్ ను ABP దేశం పలకరించింది. ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాటు నాటు పాట ఇంతటి విజయం వెనుక కృషి, పాట నేపథ్యం, ఇలా అనేక అంశాలు చంద్రబోస్ తో మచ్చటించింది. చంద్రబోస్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

Continues below advertisement

‘నాటు నాటుకు ఇంతటి ప్రసంశలతో ఉబ్బితబ్బివుతున్నాను. మొదట ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు, ఆయా ప్రాంతాల పదాల అల్లికతో ఇప్పుడున్న తరం వారికి అర్థమయ్యే విధంగా పాట రాయాలంటూ రాజమౌళిగారు చెప్పడంతో ఆలోచనలో పడ్డాను. కారులో వెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఇంటికి సమీపంలో నాటు నాటు నాటు... వీరనాటు.. ఊర నాటు.. అంటూ వచ్చిన పదాలు నచ్చడంతో వెంటనే ఫోన్ లో రికార్డ్ చేసుకున్నాను. అలా పదాలను కూర్చి పాట పూర్తి చేయడంతో పాటు దర్శకుడు చెప్పిన సందర్భానికి సరిపోయేలా నాటు పాటతోపాటు మరో రెండు పాటలు , మొత్తం మూడు పాటలతో రాజమౌళిగారిని కలిశాను. ఆయన మూడు విని, నాటు నాటు లిరిక్స్ నచ్చడంతో దానిమీద కూర్చుందాం అంటూ చెప్పారు. అలా నాటు నాటు పాట ప్రయాణం మొదలైంది. అతి తక్కువ సమయంలోనే తొంభై శాతం పాట పూర్తి చేయగా, కేవలం పది శాతం పూర్తి చేయడానికి నాకు 19 నెలలు పట్టింది. పాటలో రాజమౌళి అక్కడక్కడా చిన్న మార్పులు, చేర్పులు చెప్పడంతో కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు పాట పూర్తి చేయడం డైరెక్టర్ రాజమౌళికి నచ్చడం జరగడం జరిగిపోయాయి.

రాజమౌళి తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు పాట విషయంలో ఎక్కడా రాజీపడలేదు. లిరిక్స్, కొరియోగ్రఫీ ఇలా పాట విషయంలో దర్శకుడు రాజమౌళి  చూపించిన శ్రద్ధ ఈరోజు నాటు నాటు సాంగ్‌కు పెద్ద అవార్డను కట్టబెట్టింది. నాటు నాటు పాట .. నా జీవితం.. ఎందుకంటే అందులో ఉపయోగించిన పదాల వెనుక నా చిన్నప్పటి పల్లెజీవితం ఆనవాళ్లు, అనుభవాలే అన్ని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మారుమూల గ్రామం చల్లగరిగె. ఈ గ్రామంలో తండ్రి స్కూల్ టీచర్ గా చేస్తే ,తల్లి వ్యవసాయం పనులు చేసేది. అలా చిన్నప్పటి నుండి కష్టం తెలిసి, పల్లెటూరి స్వచ్చమైన నాటు పదాలు తెలియడంతో ఆయా పదాలు, అనుభవాలే ఈ పాటలో కూర్చాను. "ఎర్రజొన్న రొట్టెలో మిరపతొక్కు, కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు, మర్రి సెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు" ఇలా నాటు నాటు పాట వెనుక నా జీవితానుభవం దాగుంది’ అన్నారు లిరిసిస్ట్ చంద్రబోస్.

అంతర్జాతీయ స్దాయిలో అవార్డుల పోటీలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తలపడటం చూస్తుంటే గర్వంగా అనిపించేది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సొంత చేసుకోవడం అమితానందాన్ని ఇస్తోంది. గత రాత్రి దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తెల్లవారుజామున 4గంటలకు ఇంటికి వచ్చి, పైన బెడ్ రూమ్ లో పడుకున్నాను. ఈరోజు ఉదయం 8 గంటలకు నా భార్యనిద్రలేపి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని చెప్పడంతో నా ఆనందానికి అవదుల్లేవు. ఆ వార్త తెలిసిన కొద్దిసేపటికే చిరంజీవి రెండు సార్లు ఫోన్ చేసి నన్ను స్వయంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం అమితానందాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కళ్లచెమర్చాయి. నా జీవితంలో ఇది మరువలేని రోజు. ఈ సినిమాలో పాట రాసేందుకు అవకాశం కల్పించిన రాజమౌళి, కీరవాణి లకు ప్రత్యేక ధన్యవాదాలు. 

నాటు నాటు పాట విషయంలో రాజమౌళిగారు మొదట్లోనే బ్రిటీషర్లను ఏమాత్రం అవమానించకుండా ఈ పాటలో పదాలు ఉండాలని షరతు పెట్టడంతో కాస్త జాగ్రత్తగా పాటలో పదాల అల్లిక జరిగింది. సినిమాలో తనకు కావాల్సిన అంశాలు నటుల నుండే కాదు గేయ రచయితలు, సంగీత దర్మకుల నుంచి రాబట్టుకునే విషయంలో రాజమౌళీ మొండిగా ఉంటారు. అందుకే ఆయన సినిమాలు ఇంతలా ప్రజాధరణ పొందటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇలా నాటు సాగు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న సందర్బంగా మనసులో మాటలు ABP దేశంతో పంచుకున్నారు ప్రముఖ గేయ రచయిత కె.చంద్రబోస్. 

Continues below advertisement
Sponsored Links by Taboola