రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ పై కేసు నమోదైంది. ఆమె అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు. అయిదు నెలలుగా జైల్లోనే ఉంది. జైలుకి వెళ్లినప్పటి నుంచి ఆమె బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తోంది. చివరికి సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.  అలాగే పోలీసులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని  షరతు విధించింది కోర్టు. ఇదే కేసులో రాజ్ కుంద్రాకు సోమవారమే బెయిల్ లభించింది. కాగా గెహనా గతంలో బాంబే హైకోర్టుకు మొదట బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో సవాలు చేసి బెయిలు పొందింది. బెయిలు రావడంపై ఆనందం వ్యక్తం చేసింది గెహనా. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అంది. 


ఆమె తన ఇన్ స్టా ఖాతాలో బెయిలుపై స్పందించింది.  తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని పోస్టు పెట్టింది. గురువారం ముంబై క్రైమ్ బ్రాంచ్ ముందు విచారణకు హాజరైంది. విచారణ పూర్తయ్యాక బయటికి వస్తూ మీడియాతో మాట్లాడింది. ‘ఎఫ్ ఐఆర్ చూస్తే నా మీద పెట్టిన కేసు తప్పని అందరికీ అర్థమవుతోంది. అయినా సరే ఆ కేసులో నన్ను కొనసాగించారు. కానీ చివరకు నాకు బెయిలు లభించింది.  ఇందుకు  సుప్రీంకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. తాను పోర్నోగ్రఫీ కేసు విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్లే తనను అదే కేసులో ఇరికించారని అంది గెహనా. ‘నన్ను బలవంతంగా ఇందులో ఇరికించారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది. 


రాజ్ కుంద్రా బెయిలుపై స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా ‘నేను అతడి గురించి ఏ కామెంట్లు చేయదలచుకోలేదు. మా ఇద్దరం కలిసి నిర్మించిన సినిమాలు పోర్న్ కాదు అని మాత్రమే చెప్పదలచుకున్నా’ అని ముగించింది గెహనా.