Game Changer Ticket Rates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంతకీ షోలు ఎన్నింటి నుంచి ప్రారంభం అవుతాయి? టికెట్ రేట్ల ధరలు ఎలా ఉండనున్నాయి?
ఒంటి గంట నుంచే షోలు...
క్యాలెండర్‌లో జనవరి 10వ తేదీ రాగానే అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘గేమ్ ఛేంజర్’ షోలు ప్రారంభం కానున్నాయి. బెనిఫిట్ షోలకు టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ణయించారు. ఇది కాకుండా మొదటి రోజు ఆరు షోలు పడనున్నాయి. ఈ ఆరు షోలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరల కంటే రూ.135 (సింగిల్ స్క్రీన్లలో), రూ.175 (మల్టీప్లెక్స్‌ల్లో) పెంచుకోవచ్చు. రెండో రోజు (జనవరి 11వ తేదీ) నుంచి 14వ రోజు(జనవరి 23వ తేదీ) వరకు ఈ పెంపు అందుబాటులో ఉండనుంది. అంటే మొదటి రెండు వారాలు ఏపీ సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.282.50 వరకు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.352 వరకు ఉండనుందన్న మాట. 15వ రోజు నుంచి నార్మల్ ధరలు అమల్లోకి రానున్నాయి.
తెలంగాణలో వస్తాయా?
తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల ధరల పెంపులకు పర్మిషన్లు ఇవ్వబోమని అసెంబ్లీలోనే ప్రకటించారు. మరి ‘గేమ్ ఛేంజర్’కు ఎలాంటి పర్మిషన్లు వస్తాయో చూడాలి మరి!
ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్...
జనవరి 2వ తేదీన విడుదల అయిన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్, 5.4 లక్షలకు పైగా లైక్స్‌ను సాధించింది. టాలీవుడ్‌లో మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్లలో గేమ్ ఛేంజర్ మూడో స్థానంలో ఉంది. ‘పుష్ప 2: ది రూల్’ (44.67 మిలియన్లు), ‘గుంటూరు కారం’ (37.68 మిలియన్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికి గేమ్ ఛేంజర్ తెలుగు ట్రైలర్ 54 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దీన్ని బట్టి ట్రైలర్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చిందని అనుకోవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ‘గేమ్ ఛేంజర్’ ఎంత విధ్వంసం చేస్తుందో చూడాలి!