ఇటీవల కాలంలో ఇతిహాసాలు, పురాణాలు మరియు దేవుళ్ళు దేవతల కాన్సెప్ట్‌ తో రూపొందించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న అలాంటి చిత్రాలకి పాన్ ఇండియా స్థాయిలో విశేష ఆదరణ లభిస్తుండటంతో, ఇండస్ట్రీ అంతా అదే బాటలో నడుస్తోంది. గుడులు, దేవుళ్ళ చుట్టూ అల్లుకున్న కథలను తెర మీదకు తీసుకురావడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటే.. హీరోలు సైతం ఆ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దైవం, దైవత్వం కాన్సెప్ట్ తో ఇప్పటికే వచ్చిన చిత్రాలు, త్వరలో రాబోతున్న సినిమాలేంటో చూద్దాం.


యువ హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కిన 'కార్తికేయ 2' సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. శ్రీ కృష్ణుడు, కృష్ణతత్వం, ద్వారక నగరం సీక్రెట్స్ నేపథ్యంలో ఈ మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కింది. నార్త్ మార్కెట్ లో ఎవరూ ఊహించని వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్లు కలెక్ట్ చేసింది. 'కార్తికేయ' మొదటి భాగంలో కుమార స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాన్ని చూపించిన సంగతి తెలిసిందే. రాబోయే 'కార్తికేయ 3' సినిమా సైతం దేవుళ్ళ కాన్సెప్ట్ తోనే ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. 


అంతకముందు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. శివుడు, దేవాలయాల పరిరక్షణ గురించి చెబుతూ, కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కాంతారా' సినిమాను కన్నడ సంస్కృతులు సంప్రదాయాలు, గ్రామ దేవతల స్పూర్తితో తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో త్వరలో 'కాంతారా 2' చిత్రం రూపొందనుంది. 


ఇక దేవుళ్ళు, క్షుద్రపూజల నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా మిస్టరీ థ్రిల్లర్ 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇలా గుళ్ళు దేవుళ్ళ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తుండటంతో, ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. ఫిలిం మేకర్స్ అంతా ఏదొక విధంగా దైవత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చి, హిట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.


'విరూపాక్ష' తరహాలోనే 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది విభిన్నమైన కథతో రూపొందే సూపర్ నేచురల్ ఫాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్.  శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణంకు ఇప్పటి గరుడ పురాణంకు నాలుగు పేజీలు తగ్గాయని.. మాయమైపోయిన నాలుగు పేజీలే ఈ భైరవ కోన అంటూ టీజర్‌ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. 


సాయి తేజ్ సోదరుడు, 'ఉప్పెన' ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు కోసం గుడి, దైవం దారిలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వైష్ణవ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆది కేశవ' గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజయ్యింది. 'అఖండ' తరహాలో రాయలసీమ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఊర్లోని శివుడి గుడి చుట్టూ ఈ కథ నడుస్తుందని గ్లిమ్స్ ని బట్టి అర్థమవుతోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'హను-మాన్' సినిమా ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న కథతో రూపొందుతోంది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలయికలో 'బ్రో' అనే సినిమా రూపొందుతోంది. ఇది 'వినోదయ సీతమ్' అనే తమిళ్ చిత్రానికి రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ, దేవుడు - భక్తుడు కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ మోడరన్ దేవుడిగా కనిపించబోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రాన్ని రామాయణం ఇతిహాసం ఆధారంగా తీస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా జూన్ 16న విడుదల కాబోతోంది. అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్ట్ K' మూవీ, విష్ణువు యొక్క ఆధునిక అవతారం గురించి చెబుతుందని నిర్మాత అశ్వినీ దత్ పేర్కొన్నారు.


ఇలా అనేక చిత్రాలు గుళ్ళు దేవుళ్ళు, ఇతిహాసాలు పురాణాల కథలతో వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ తో సరిగ్గా సినిమా తీస్తే ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అఖండ, కార్తికేయ 2, కాంతారా, విరూపాక్ష సినిమాలు నిరూపించాయి. సరిగ్గా తీయకపోతే ఎంత పెద్ద డిజాస్టర్ అవుతాయో 'ఆచార్య', 'శాకుంతలం' సినిమాలు చెప్పాయి. మరి త్వరలో రాబోతున్న చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.


Read Also: తమిళ దర్శకుల దెబ్బ, తెలుగు హీరోలు అబ్బ - పవన్, చరణ్ పరిస్థితి ఎలా ఉంటుందో?