Fighter Movie Release: హృతిక్ రోషన్, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఫైటర్’ మూవీ విడుదలకు గల్ఫ్ దేశాలు నిరాకరిస్తున్నాయి. యూఏఈలో తప్పా ఇతర గల్ఫ్ దేశాల్లో ‘ఫైటర్’ మూవీ రిలీజ్ అవ్వడం లేదని నిర్మాత గిరీష్ జోహార్ స్వయంగా ప్రకటించారు. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న బాలీవుడ్ మూవీ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ నిర్ణయం వెనుక కారణమేంటో గిరీష్ బయటపెట్టలేదు.


దేశభక్తి నేపథ్యంలో..


గల్ఫ్ దేశాల్లో ‘ఫైటర్’ మూవీ రిలీజ్ అవ్వకపోవడంపై మేకర్స్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారినా.. దానిపై క్లారిటీ ఇవ్వడానికి మేకర్స్ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బీ టౌన్‌లో దీనికి సంబంధించిన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డ్ నుంచి ‘ఫైటర్’కు గ్రీన్ సిగ్నల్ రాలేదని, అందుకే మూవీ అక్కడ రిలీజ్ అవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇండియాలో జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనెతో పాటు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబ్రాయ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంపై ‘ఫైటర్’ తెరకెక్కిందని ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ గల్ఫ్ దేశాల సెన్సార్‌ను పూర్తి చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయ్యిండవచ్చని కొందరు ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


యాక్షన్ సినిమాలతో గుర్తింపు..


బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. తన సినిమాలో యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడతాడు సిద్ధార్థ్. అందుకే వాటిని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించగలుగుతాడు. దానికోసం టీమ్ అంతా ఎంత కష్టపడాల్సి వచ్చినా వెనకాడడు. అందుకే ఇప్పటివరకు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ప్రతీ బాలీవుడ్ యాక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సిద్ధార్థ్ తెరకెక్కించాడంటే ఆ సినిమా మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ప్రేక్షకులతో పాటు నిర్మాతలు సైతం ఫిక్స్ అయిపోయారు. ఇక అలాంటి దర్శకుడికి ‘ఫైటర్’ చాలా పర్సనల్ సినిమా అని పలు సందర్భాల్లో బయటపెట్టాడు.


సినిమా చాలా స్పెషల్..


‘నేను, నా భార్య మమతా కలిసి ఫైటర్‌తోనే మార్ఫ్‌లిక్స్ అనే ఫిల్మ్ కంపెనీని ప్రారంభించాం. ఒక్క విధంగా కాకుండా ఎన్నో విధాలుగా ఈ సినిమా మాకు చాలా స్పెషల్. ఇది మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మేము పూర్తిస్థాయిలో దీనికోసం కష్టపడ్డాం. 2024 అనేది ఆందోళనతోనే మొదలయ్యింది. పఠాన్‌పై ఎలా అయితే ప్రేమను చూపించారో.. ఫైటర్ మీద కూడా అలాగే చూపిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ తన న్యూ ఇయర్ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ‘ఫైటర్’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ ప్రారంభించిన మార్ఫ్‌లిక్స్ పిక్చర్స్‌తో పాటు వియాకోమ్18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించింది. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన ‘పఠాన్’తో గతేడాది భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్ధార్థ్ ఆనంద్.


Also Read: కోలుకున్న సైఫ్‌ అలీ ఖాన్‌, చేతికి కట్టుతో ప్రత్యక్షం - ‘దేవర’‌కు అడ్డంకులు తొలగేనా?