పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరిగిన తర్వాత కాంబినేషన్స్ సెట్ కావడం చాలా కష్టం అవుతోంది. క్వాలిటీ విషయంలో రాజీ అనే మాట లేకుండా సినిమాలు తీస్తుండడం వల్ల ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు పడుతోంది. దాంతో హీరోల కోసం దర్శకులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏడాది కంటే ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో మరో హీరో దగ్గరకు కొత్త కథతో వెళ్తున్నారు. తెలుగులో లేటెస్టుగా ఈ లిస్టులో రెండు సినిమాలు చేరాయని ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే...
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రామ్ చరణ్!'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాలతో సందీప్ రెడ్డి వంగ మార్క్ ఏమిటో హీరోలతో పాటు ప్రేక్షకులకు తెలిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా చేసేందుకు ఆ దర్శకుడు రెడీ అవుతున్నారు. ప్రభాస్ లైనపు బిజీగా ఉండడంతో పాటు ఇప్పటిలో సందీప్ రెడ్డి వంగ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదనే క్లారిటీ ప్రేక్షకులకు వస్తోంది. దాంతో మరో హీరో కోసం ఆయన చూస్తున్నారట.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్న కథను మెగా హీరో దగ్గరకు వచ్చి చెప్పారని సదరు వార్తల సారాంశం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్!రచయితగా మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ విజయాలు అందుకున్నారు. మరి ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి సినిమాలో ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. దర్శకుడు అయ్యాక వెంకీతో సినిమా చేయలేదు త్రివిక్రమ్. ఆ మధ్య ఒక సినిమా అనౌన్స్ చేసిన అది పట్టాలు ఎక్కలేదు.
Also Read: 'హనుమాన్' నిర్మాతను ఆ దర్శకులు ఇద్దరు ఛీట్ చేశారా? ఛాంబర్ మెట్లు ఎక్కిన వివాదం??
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'... మూడు విజయాల తరువాత అల్లు అర్జున్ హీరోగా డబ్బులు హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుట్టడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యారు. 'పుష్ప 2 ది రూల్' విజయం తర్వాత గురూజీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమిళ దర్శకుడు అట్లీతో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. దాంతో వెంకటేష్ హీరోగా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి.
రామ్ చరణ్ - సందీప్ రెడ్డి వంగా సినిమా... వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా... ఈ రెండిటి మధ్య ఒక్క కామన్ విషయం ఉంది అదేమిటంటే ఈ రెండింటిలో నిజం కొంచెం కూడా లేదు. సోషల్ మీడియాలో పుట్టిన పుకార్లు తప్ప ఆ సినిమాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.
Also Read: 'జైలర్ 2'లో బాలకృష్ణ... రజనీకాంత్ సినిమా గురించి శివన్న ఏం చెప్పారంటే?