Just In





Vincy Aloshious: సెట్‌లో హీరో అనుచిత ప్రవర్తన... డ్రగ్స్ తీసుకునే వారితో సినిమాలు చేయనంటూ హీరోయిన్ స్టేట్మెంట్
Vincy Aloshious : మలయాళ నటి విన్సీ అలోషియస్ తన సహనటుడు డ్రగ్స్ తీసుకున్నాడని, ఆ తరువాత తన దుస్తులను సరిచేసే నెపంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించింది. అయితే ఆమె ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు

ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్ తాజాగా తనకి సినిమా సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందుకే తను డ్రగ్స్ తీసుకునే సహనటులతో కలిసి ఇకపై పని చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించింది.
సెట్లో హీరోతో చేదు అనుభవం
ఇటీవల విన్సీ కేరళలో ఓ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో మాట్లాడుతూ "ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే, నేను వాళ్లతో ఏ సినిమాలోనూ నటించను" అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది అనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో విన్సీ నుంచి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ అందరినీ షాక్ కు గురి చేసింది. కొంతమంది ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తాజాగా విన్సీ అసలు ఆ ప్రకటన ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించింది.
తాజా వీడియోలో ఆమె మాట్లాడుతూ "మూవీ సెట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నా దుస్తుల విషయంలో ఇబ్బంది తలెత్తింది. అందరూ చూస్తుండగానే ఆ హీరో నా దగ్గరికి వచ్చి దాన్ని సరి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో చాలా అసౌకర్యంగా అనిపించింది. పైగా అతడితో పని చేయడం కష్టంగా మారింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు అతను తెల్లటి పొడిని తీసుకోవడం కనిపించింది. దీంతో అతను డ్రగ్స్ తీసుకున్నాడనే విషయం స్పష్టంగా అర్థమైంది. డైరెక్టర్ కూడా అతనితో ఈ విషయమై మాట్లాడాడు. వ్యక్తిగత జీవితంలో డ్రగ్స్ వాడటం లేదా వాడకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం. కానీ సినిమా సెట్ లో అలాంటివి వాడితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తులతో పని చేయడం అంత ఈజీ కాదు. అలాంటి వాళ్లతో పని చేయడానికి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు" అంటూ తేల్చి చెప్పింది. అయితే విన్సీ ఏ సినిమా షూటింగ్లో, ఏ హీరోతో ఇలా ఇబ్బంది పడింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
సినిమా అవకాశాలు తగ్గే ఛాన్స్...
ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై కూడా ఆమె స్పందించింది. ఆమె మాట్లాడుతూ "బహుశా ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో నాకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోవచ్చు. అయినప్పటికీ నేను ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే వాళ్లతో కలిసి నటించను అని బహిరంగంగా చెప్పాలనుకుంటున్నాను" అంటూ బాంబు పేల్చింది.
ఇదిలా ఉండగా విన్సీ అలోషియస్ 2019లో 'వికృతి' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. 'రేఖ'లో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. అలాగే 'జన గణ మన', 'సౌదీ వెల్లక్క', 'పద్మిని', 'పజంజన్ ప్రణయం' వంటి మలయాళ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. ఆమె చివరిగా 'మారివిల్లిన్ గోపురంగల్' చిత్రంలో మీనాక్షిగా తెరపై మెరిసింది.