కరుణాడ చక్రవర్తిశివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా '45' (45 Movie). సూరజ్ ప్రొడక్షన్ పతాకంపై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడలో 150కు పైగా సినిమాలకు సంగీతం అందించిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ప్రేక్షకులను ఛీట్ చేయడం ఇష్టం లేదు - శివన్న
తనకు క్యాన్సర్ అని తెలిశాక, కీమో థెరపీ తీసుకున్న నాలుగైదు రోజులకు ఈ '45' మూవీ క్లైమాక్స్ చేశానని శివరాజ్ కుమార్ చెప్పారు. ప్రేక్షకులను ఛీట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను షూటింగ్ చేశానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమా కథను అర్జున్ జన్యా నాలుగు నుంచి ఐదు నిమిషాలు లోపే చెప్పారు. అందుకే 45 అని టైటిల్ పెట్టాం (నవ్వుతూ). దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి ఇస్తానంటే వద్దని చెప్పారు. అతనే న్యాయం చేయగలడని సినిమా ఛాన్స్ ఇచ్చాను. ఉపేంద్రతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఇందులో రాజ్ బి శెట్టి మరొక ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమాలో హీరోలు మేం కాదు... కథే మెయిన్ హీరో. దర్శకుడిగా అర్జున్ జన్యాకు మంచి పేరు వస్తుంది. ప్రేక్షకులు కొత్త స్క్రీన్ ప్లేను చూస్తారు'' అని అన్నారు.
కథ, క్యారెక్టర్లు పస్తుతానికి సస్పెన్స్ - ఉపేంద్ర
'45' సినిమా కథేంటి? ఇందులో క్యారెక్టర్లు ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని రియల్ స్టార్ ఉపేంద్ర చెప్పారు. ఇందులో క్లాస్, మాస్, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ... ''దర్శకుడు అర్జున్ జన్యా '45'లో నన్ను కొత్తగా చూపించారు. మా ఇంట్లో నా కాజువల్ లుక్ చూసి సినిమాలోనూ సేమ్ లుక్ ఉండాలని చెప్పారు. 'ఓం' సినిమా షూటింగ్ రెండో రోజే నేను పెద్ద దర్శకుడిని అవుతానని శివన్న చెప్పారు. ఆయనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'కూలీ'లో రజనీకాంత్, నాగార్జున గారితో నటించాను'' అని అన్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని కాన్సెప్ట్ - నిర్మాత
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా రాలేదని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మేమంతా ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశాం. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు ఇటువంటి సినిమా కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఉంటాయి. ట్రైలర్ విడుదల అయ్యాక సినిమా గురించి మరిన్ని విషయాలు చెబుతా'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అర్జున్ జన్యా కూడా పాల్గొన్నారు. ఈ సినిమాను సీజీ, డైలాగ్స్, నేపథ్య సంగీతంతో సహా విజువలైజ్ చేసిన తర్వాత చిత్రీకరణకు వెళ్లామని ఆయన వివరించారు.