నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). ఇందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 


అబ్బాయ్ ఎలా చేశాడో చూశారా?
'ధర్మ క్షేత్రం'లో బాలకృష్ణ, దివ్య భారతిపై తెరకెక్కించిన 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...' పాటను కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా 'అమిగోస్' కోసం రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోను ఈ నెల 27న విడుదల చేశారు. ఫుల్ సాంగ్ వీడియో 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, తారక రత్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. ఈ రోజు ఫుల్ సాంగ్ వీడియో విడుదల చేశారు. 


బాబాయ్ బాలకృష్ణ పాటను అబ్బాయ్ కళ్యాణ్ రామ్ ఎలా చేశారో? ఆయనకు జోడీగా ఆషికా రంగనాథ్ ఎలా చేశారో చూడండి. 



'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' పాటను స్వర్గీయ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. 'ధర్మక్షేత్రం'లో పాటను ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించారు. ఇప్పుడీ 'అమిగోస్'లో పాటను ఎస్పీబీ తనయుడు చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. జిబ్రాన్ రీమిక్స్ చేశారు. బాలకృష్ణ పాటను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 'పటాస్' కోసం 'అరె ఓ సాంబ...' సాంగ్ రీమిక్స్ చేశారు. మరోసారి బాబాయ్ పాటతో అభిమానులకు కనువిందు ఇవ్వడానికి రెడీ అయ్యారు.


Also Read : తారకరత్నను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ - మృత్యుంజయ మంత్రంతో


మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్... 'అమిగోస్'లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళ మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే 'యెక యెక...' పాటను తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురి క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం చూపించారు. బీచ్ ఏరియాలో మాంచి స్టైలిష్, కలర్ ఫుల్ అమ్మాయిల మధ్య పాటను చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ మాత్రమే కాదు... నటుడు బ్రహ్మాజీ కూడా పాటలో ఉన్నారు. జిబ్రాన్ సంగీతంలో  'యెక యెక...' పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. అనురాగ్ కులకర్ణి పాటను ఆలపించారు.


Also Read : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!


'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది.


ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు!
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'అమిగోస్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.


'అమిగోస్' చిత్రానికి కూర్పు : త‌మ్మిరాజు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : అవినాష్ కొల్ల‌, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్ట‌ర్స్: వెంక‌ట్, రామ్ కిష‌న్‌, పాట‌లు:  'స్వ‌ర్గీయ' శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌, ఛాయాగ్రహణం : ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్, సి.ఇ.ఓ :  చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హ‌రి తుమ్మ‌ల‌, సంగీతం : జిబ్రాన్.