దేశంలో చీకటి రోజులుగా చెప్పుకునేది భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని 'ఎమర్జెన్సీ' రోజులే. దీని ఆధారంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నారు. ఈ చితం షూటింగ్ మొదలైనట్టు కంగనా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు. కంగనా ఇందిరా గాంధీ లుక్ లో అదిరిపోయారు. అచ్చుగుద్దినట్టు ఆమెలాగా కనిపించడంతో పాటు హావభావాలు పలికించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "అమెరికా ప్రెసిడెంట్ కి చెప్పండి. నా కార్యాలయంలో అందరూ నన్ను మేడమ్ కాదు సర్ అని పిలుస్తారని చెప్పండి" అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఎమర్జెన్సీ చిత్రంలో కంగనా లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఇందిరా గాంధీ తిరిగొచ్చింది. పర్ఫెక్ట్ లుక్' అని కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రానికి స్వయంగా కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థ మీద కంగనా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అద్భుతమైన ప్రయాణం అని ఆమె వర్ణించారు. మణికర్ణిక తర్వాత కంగనా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. అంతే కాదు ఈ చిత్రానికి కథ కూడా కంగనానే అందిస్తున్నారు. 1975 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. అందుకే భారతదేశంలో ఎమర్జెన్సీ ని చీకటి రోజులుగా భావిస్తారు.
గతంలో దివంగత నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'తలైవి' చిత్రంలో జయలలిత పాత్ర పోషించారు. ఆ పాత్ర కోసం అప్పట్లో ఆమె బరువు కూడా పెరిగారు. జయలలిత లాగా కనిపించేలా ఆమె ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు.