Shilpa Shetty Flat and Properties Seized By ED: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) షాకిచ్చింది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో వారి ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ముంబై జుహు ప్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఈ కేసులో రూ. 98 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తోంది. కాగా గతంలో రాజ్‌కుంద్రా బిట్‌కాయిన్‌ పేరుతో మోసాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


2017లో రాజ్‌కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్‌ కాయిన్‌ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ. 6600 కోట్ల అక్రమంగా సంపాదించాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు పది శాతం లాభాలు వస్తాయయని ప్రజలను నమ్మించారు. డబ్బులు చేతికి వచ్చాక ఇన్వెస్టర్లను మోసం చేశారు. ఈ మోసం బయటపడటంతో ఈడీ అధికారులు సదరు బిట్‌కాయిన్‌ సంస్థ, దాని ప్రమోటర్లపై కూడా కేసు నమోదు చేసింది. ఇలా బిట్‌ కాయిన్‌తో స్కామ్‌లకు పాల్పడుతూ ఎంతోమందిని మోసం చేసినట్టు ఆయనపై మహారాష్ట్ర, ఢిల్లీ ఇతరప్రాంతాలు రాజ్‌కుంద్రాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నమోదైన వివిధ కేసుల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిల ఆస్తులను కూడా బిట్‌ కాయిన్‌ స్కామ్‌కు అటాచ్‌ చేసి ఆస్తులు జప్తు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.


రాజ్‌కుంద్రా స్నేహితులు అరెస్ట్‌


కాగా ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు అతడి స్నేహితులు సింపీ భరద్వాజ్‌, నితిన్‌ గౌర్‌, నిఖిల్‌ మహాజన్‌ అరెస్ట్‌ అయ్యారు నిందితులుగా ఉండగా ఇప్పటికే వారు అరెస్ట్‌ అయ్యారు.  ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. బిట్‌ కాయిన్‌ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితుడైన అజయ్‌ భరద్వాజ్‌, మహేంద్ర భరద్వాజ్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ స్కామ్‌కు ప్లాన్‌ చేసిన మాస్టర్‌ మైండ్‌ అమిత్‌ భరద్వాజ్‌ 2022లో మరణించారు. అయితే ఆయన గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్‌కాయిన్లు ఇచ్చినట్టు విచారణలో తేలింది. వాటితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ ఏర్పాటు చేయాలని భావించాడట. కానీ, అది కుదరలేదు.అయితే, ఇప్పటికీ ఆ బిట్‌ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్టు విచారణలో రాజ్‌కుంద్ర పేర్కొన్నట్టు ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా గతంలో రాజ్ కుంద్రాపై పోర్న్ వీడియో కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో అతడు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లాడు. అప్పుట్లో ఈ వార్త ఇండస్ట్రీలో కలకలం రేపింది. 


Also Read: కొత్త ఇల్లు కొన్న 'డాక్టర్‌ బాబు' - భార్యతో కలిసి నూతన ఇంటి గృహ ప్రవేశం, ఫోటోలు వైరల్‌