Dulquer Salmaan Announced Kaantha Movie Release Postponed: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12న (శుక్రవారం) రిలీజ్ చేస్తామని మూవీ టీం ముందు ప్రకటించింది. తాజాగా రిలీజ్ వాయిదా వేస్తూ అధికారికంగా ప్రకటించింది.
కొత్త లోక ఎఫెక్ట్
రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర' మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ జోష్ థియేటర్‌లో ఇంకా కొనసాగుతుండడంతో 'కాంత' మూవీని వాయిదా వేస్తున్నట్లు టీం తెలిపింది. ''కాంత' టీజర్ రిలీజ్ అయిన రోజు నుంచి మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు చాలా ధన్యవాదాలు. మీకు మరింత ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. 'కొత్త లోక' విజయంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం.
ఇదే ఉత్సాహం మరో అద్భుతమైన సినీ ప్రయాణంలోకి తీసుకెళ్లే స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌ను మేము రెడీ చేస్తున్నాం. ఈ క్రమంలో 'కాంత' మూవీ వాయిదా పడిందని మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అంతవరకూ ఇలాగే అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం.' అని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
ఈ మూవీలో దుల్కర్ సినీ హీరోగా సముద్రఖని డైరెక్టర్‌గా కనిపించనుండగా... భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా... స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఝును మ్యూజిక్ అందిస్తుండగా... రానా ఓ కీలక రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది.
1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఇండస్ట్రీలో ఓ హీరోకు, డైరెక్టర్‌కు మధ్య జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఎంతో ఎమోషన్, లవ్ ఒకరిపై ఒకరు ఎఫెక్షన్‌తో ఉండే హీరో, డైరెక్టర్‌కు మధ్య ఏం జరిగింది? వారు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? తనకు విద్య నేర్పిన గురువుకే ఎందుకు హీరో వ్యతిరేకంగా మారారు? అతన్నే ఎందుకు తొక్కేయాలని చూశారు. అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
జనతా హోటల్ నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ టాలీవుడ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. 'కాంత' మూవీతోనూ ఆయన హిట్ కొట్టడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.